last phase of local body elections
-
ప్రాదేశిక పోరు ముగిసంది
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రాదేశిక పోరు ముగిసంది. దాదాపు నెలరోజులుగా పల్లెల్లో కొనసాగిన హడావుడికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. తొలివిడతలో 16 మం డలాల్లో ప్రాదేశిక ఎన్నికలు పూ ర్తికాగా, మలివిడతలో 17 మండలాల్లో ఎన్నికలు ప్రశాం తంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం జరిగిన మలివిడత ప్రాదేశిక పోరులో 17 జెడ్పీటీసీ, 311 ఎంపీటీసీ స్థానాలకు అధికారులు పోలింగ్ నిర్వహించగా ఓటర్లు ఉత్సాహంతో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,71,463 మంది ఓటర్లకు 6,16,399 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 79.9% పోలింగ్ నమోదైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ఉత్సాహం చూపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరిగింది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తొలి రెండు గంటల్లో ఏకంగా 17.8% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 11 గంటల సమయంలో 34.82% మంది ఓట్లు వేశారు. అనంతరం ఓటర్ల తాకిడి మరింత పెరిగింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పోలింగ్ 54.76 శాతానికి చేరింది. ఎండ తీవ్రత పెరగడం ఓటింగ్‌పై ప్రభావం చూపింది. దీంతో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో పోలింగ్ మందగించి 66.46శాతానికి చేరింది. సాయంత్రం పోలింగ్ ముగిసేనాటికి 79.9 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో అధికంగా కందుకూరు మండలంలో 91.1% ఓట్లు పోలవగా, అత్యల్పంగా సరూర్‌నగర్ మండలంలో 46.05% పోలింగ్ నమోదైంది. నెల తర్వాతే ఫలితాలు ప్రాదేశిక సమరం ముగిసినప్పటికీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఓట్ల లెక్కింపు చేపట్టొద్దని న్యాయస్థానం ఆదేశాలున్న సంగతి తెలిసిందే. దీంతో గెలుపోటములు తెలుసుకోవాలంటే నెలరోజులు ఆగాల్సిందే. గెలుపోటములపై ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నప్పటికీ.. ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే. -
మలి పోరుకు రె‘ఢీ’
సాక్షి, ఖమ్మం : మలివిడత స్థానిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం డివిజన్లోని 17 జెడ్పీటీసీ, 265 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు 854 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రమే ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అదే రీతిలో మలివిడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 17 జెడ్పీటీసీ స్థానాలకు 77 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం డివిజన్లో 268 ఎంపీటీసీ స్థానాలకు ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి, గోళ్లపాడు, చింతకాని మండలంలోని నేరడ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహాయిస్తే మిగిలిన 265 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 870 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి విడత ఎన్నికల పరిస్థితులను సమీక్షించిన అధికారులు మలివిడత పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కెమెరాలతో నిఘా పెట్టారు. మొత్తం 62 వెబ్ కెమెరాలకు గాను చింతకాని మండలంలో 16, కల్లూరులో 4, కొణిజర్లలో 7, కూసుమంచిలో 9, నేలకొండపల్లిలో 4, సత్తుపల్లిలో 4, తిరుమలాయపాలెంలో 5, ఖమ్మంరూరల్‌లో 2, వైరా మండలంలో 11 కెమెరాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలకు పాల్పడినా ఈ కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి 4,697 మంది విధుల్లో పాల్గొననున్నారు. 87 మంది జోనల్ అధికారులు, 122 మంది రూట్ అధికారులు, 134 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. భారీ బందోబస్తు.. ఈ ఎన్నికల నిర్వహణకు భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు. ఎన్నికల పర్యవేక్షణకు 8 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 81 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి 2,700 మంది, 421 మంది హోంగార్డులను నియమించారు. వీరితో పాటు ప్రత్యేక బలగాలు, ఏఆర్, క్యాప్ ఫోర్స్ సిబ్బంది కూడా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. -
మలి విడత పోరు నేడే
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లాలో మలివిడత ప్రాదేశిక ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. 22 జెడ్పీటీసీ, 332 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో 107 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 1,237 మంది ఎంపీటీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 1,044 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 8,43,865 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో సహా చేరుకున్నారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి మండలం చెర్లగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని కాశీపూర్‌లోని 43వ నంబరు పోలింగ్ కేంద్రంలో రిపోలింగ్ నిర్వహించున్నారు. ఎన్నికలు జరగనున్న మండలాలు ఇవే.. జిల్లాలో మొదటి విడత గా 24 మండలాల్లో ఎన్నికలు జరగగా, రెండో విడతలో 22 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. చేగుంట, హత్నూర, జిన్నారం, కౌడిపల్లి, నర్సాపూర్, రామాయంపేట, చిన్నశంకరంపేట, తూప్రాన్, శివ్వం పేట, వెల్దుర్తి, పటాన్చెరు, రామచంద్రాపురం, పాపన్నపేట, పుల్కల్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్, తొగుట, వర్గల్, దౌల్తాబాద్, గజ్వేల్, ములుగు మండలాల్లో శుక్రవారం మలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ నుంచి ఎంత మంది.. మలివిడత ప్రాదేశిక ఎన్నికల బరిలో మొత్తం 1,344 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 22 జెడ్పీటీసీ స్థానాలకుగాను 107 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్ నుంచి 22 మంది, టీఆర్ఎస్ నుంచి 22, టీడీపీ నుంచి 17, బీజేపీ నుంచి 13, సీపీఎం నుంచి నలుగురు, ఇద్దరు బీఎస్పీ, ఒకరు సీపీఐ అభ్యర్థి జెడ్పీటీసీ బరిలో ఉన్నారు. వీరితోపాటు 24 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 332 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 1,237 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి 14 మంది అభ్యర్థులు, 324 మంది కాంగ్రెస్, 296 మంది టీఆర్ఎస్, 216 మంది టీడీపీ, 161 మంది బీజేపీ, 17 సీపీఎం, 12 సీపీఐ, 11 మంది బీఎస్పీ, ఇద్దరు ఇతర గుర్తింపు పార్టీల అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరితోపాటు 185 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. భారీ బందోబస్తు ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 36 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా, 62 సమస్యాత్మక ప్రాంతాలు, 498 సాధారణ ప్రాంతాలుగా గుర్తించారు. రెండో విడత ఎన్నికల్లో ఇద్దరు ఏఎస్పీలు, ఒకరు ఓఎస్డీ, 12 మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 51 మంది ఎస్ఐలు విధులు నిర్వహించనున్నారు. వీరితోపాటు 2,964 మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.