సాక్షి, ఖమ్మం : మలివిడత స్థానిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం డివిజన్‌లోని 17 జెడ్పీటీసీ, 265 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు 854 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రమే ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
చెదురుమదురు ఘటనలు మినహా తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అదే రీతిలో మలివిడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 17 జెడ్పీటీసీ స్థానాలకు 77 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఖమ్మం డివిజన్‌లో 268 ఎంపీటీసీ స్థానాలకు ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి, గోళ్లపాడు, చింతకాని మండలంలోని నేరడ ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహాయిస్తే మిగిలిన 265 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 870 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
తొలి విడత ఎన్నికల పరిస్థితులను సమీక్షించిన అధికారులు మలివిడత పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కెమెరాలతో నిఘా పెట్టారు. మొత్తం 62 వెబ్ కెమెరాలకు గాను చింతకాని మండలంలో 16, కల్లూరులో 4, కొణిజర్లలో 7, కూసుమంచిలో 9, నేలకొండపల్లిలో 4, సత్తుపల్లిలో 4, తిరుమలాయపాలెంలో 5, ఖమ్మంరూరల్‌లో 2, వైరా మండలంలో 11 కెమెరాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలకు పాల్పడినా ఈ కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి 4,697 మంది విధుల్లో పాల్గొననున్నారు. 87 మంది జోనల్ అధికారులు, 122 మంది రూట్ అధికారులు, 134 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు.
భారీ బందోబస్తు..
ఈ ఎన్నికల నిర్వహణకు భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు. ఎన్నికల పర్యవేక్షణకు 8 మంది డీఎస్పీలు, 37 మంది సీఐలు, 81 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి 2,700 మంది, 421 మంది హోంగార్డులను నియమించారు. వీరితో పాటు ప్రత్యేక బలగాలు, ఏఆర్, క్యాప్ ఫోర్స్ సిబ్బంది కూడా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు.
మలి పోరుకు రె‘ఢీ’
Published Fri, Apr 11 2014 2:38 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement