4 రైళ్లు రద్దు.. మరో 12 దారి మళ్లింపు
చండీగఢ్: పంజాబ్లో రైతులు తమ ఆందోళనను తీవ్రం చేశారు. రైతు ప్రతికూల ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బుధవారం నుంచి రెండు రోజుల పాటు రైళ్ల రాకపోకలను అడ్డుకోవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.
రైతుల ఆందోళన దృష్ట్యా పంజాబ్ నుంచి వెళ్లాల్సిన 4 రైళ్లను రద్దు చేశారు. మరో 12 రైళ్లను దారి మళ్లించారు. పంజాబ్లో ఎనిమిది రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పంజాబ్లో పలు ప్రాంతాల్లో రైళ్లను అడ్డుకుంటామని, తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.