వెనక్కి తగ్గేది లేదు: సీఎం
చండీగఢ్ : రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీ నుంచి వెనక్కి తగ్గేది లేదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. రైతుల మొత్తం రుణభారాన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీనిచ్చారు. తనాఖాలో ఉంచిన భూమి, ఇతర ఆస్తుల్ని జప్తుకాకుండా అడ్డుకుంటామని అమరీందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూమిని జప్తుచేసి వేలం వేసే విధానం(కుర్కీ)పై ఇప్పటికే నిషేధం విధించినట్లు తెలిపారు.
రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ మీడియాకు తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలోని వడ్డీ వ్యాపారులకు లైసెన్సులు జారీచేస్తామని వెల్లడించారు. రైతుల్ని అప్పుల ఊబిలోంచి బయట పడేయడానికి పంటబీమా అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు సిద్ధూ పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దుర్వినియోగం కాకుండా చూడాలని సిద్ధూ కేంద్రాన్ని కోరారు. అంతేకాకుండా ఐదెకరాల లోపు పొలమున్న రైతుల్ని ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. ఇన్‌పుట్ వ్యయాలకు అనుగుణంగానే కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను నిర్ణయించాలని సిద్ధూ తెలిపారు.