ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలు!
దేశంలోనే తొలిసారిగా.. పంజాబ్లో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. భటిండా సమీపంలోని భుచో అనే పట్టణంలో కుల్దీప్ కౌర్ (32) అనే మహిళ ఈ ఐదుగురు ఆడ పిల్లలను కంది. ఆమె భర్త ఓ రైతు. ఈ కేసు బాగా సంక్లిష్టమైనది కావడంతో ఎవరూ కాన్పు చేసేందుకు సిద్ధం కాలేదని, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని కాన్పు చేసిన గైనకాలజిస్టు డాక్టర్ హర్కిరణ్ కౌర్ చెప్పారు. కడుపులో ఐదుగురు బిడ్డలతో.. కేవలం 5 గ్రాముల హెమోగ్లోబిన్తో ఆమె వచ్చింది. తొలుత స్కానింగులో నలుగురు పిల్లలే ఉన్నట్లు కనిపించినా, తీరా బయటకు వచ్చేసరికి ఐదుగురు అయ్యారు.
కుల్దీప్తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా క్షేమంగానే ఉన్నా.. మరో ఇద్దరి పరిస్థితి మాత్రం అంత బాగోలేదు. ఏడోనెలలోనే డెలివరీ కావడంతో వాళ్లు కేవలం 850 గ్రాములు మాత్రమే బరువున్నారని, అందువల్ల వాళ్లను 24 గంటలూ పర్యవేక్షిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నామని డాక్టర్ కౌర్ చెప్పారు. కాగా, సుఖ్పాల్ సింగ్, కుల్దీప్లకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లున్నారు. ఇప్పుడు పుట్టినవాళ్లతో కలిపి మొత్తం ఏడుగురు కూతుళ్లవుతారు. పేదరికంలో ఉన్నా కూడా.. ఇప్పుడు ఈ ఐదుగురు కూతుళ్లకు కూడా జన్మనివ్వాలనే వాళ్లు నిర్ణయించుకున్నారు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తేనే అబార్షన్ చేయించే ఈ రోజుల్లో.. ఇలా ఏడుగురిని పెంచేందుకు కూడా సిద్ధం కావడం ప్రశసంనీయమని వైద్యులు అంటున్నారు.