మణిదీప్ కౌర్
న్యూజిలాండ్ పోలీసు విభాగంలో సీనియర్ సార్జెంట్ హోదాకు చేరుకున్న భారతదేశపు మొట్టమొదటి మహిళ మణిదీప్ కౌర్. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఏ మాత్రం పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి ఎలా చేరిందో తెలుసుకోవాలంటే మణిదీప్ కౌర్ కథ తెలుసుకోవాలి.
సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది మణిదీప్ కౌర్. పద్దెనిమిదో ఏట పెళ్లి చేసేశారు ఇంట్లో. పెళ్లయిన ఏడాదికే మొదటి బిడ్డ. అర్ధంతరంగా ఆగిపోయిన కాలేజీ చదువు. ఇద్దరు పిల్లలు, బాధ్యతారాహిత్యంగా ఉండే భర్త. ప్రతిరోజూ గొడవల కాపురం. విసిగి వేసారి తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి విడాకులిచ్చి పుట్టింటికి చేరింది ఇద్దరు పిల్లలను వెంటేసుకొని. ఆర్థికంగా ఎవరిమీదా ఆధాపడకుండా బతకాలన్న ఆశ ఆమెను ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేలా చేసింది. సేల్స్ ఉమన్‌గా ఉద్యోగంలో చేరింది. ఇంటింటికీ వెళ్లి మా టెలిఫోన్ సేవలకు మారమని కస్టమర్లను ఒప్పించే పని అది. ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అందుకని, చెప్పవలసిన నాలుగు మాటలను కాగితంపై రాసుకొని, కస్టమర్లకు ఇచ్చేది. పని చేసే చోట న్యూజిలాండ్‌లో టాక్సీ నడుపుకునైనా బాగా బతకచ్చనే మాటలు వింది.
టాక్సీ డ్రైవర్‌గా!
అలా, 27 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలి, న్యూజిలాండ్‌కి ప్రయాణమైంది. ఆక్లాండ్‌లోని వైఎంసిఎ మహిళల లాడ్జిలో బస. టాక్సీడ్రైవర్‌గా జీవనం. ఆ లాడ్జిలో జాన్‌పెగ్లర్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నైట్‌టైమ్ రిసెప్షనిస్ట్‌గా పనిచేసేవాడు. రోజూ వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు పెగ్లర్‌తో మాటలు కలిశాయి. కొన్ని రోజుల్లోనే ఇద్దరికీ సంభాషణ పెరిగింది. మణిదీప్ పెగ్లర్‌ని ‘కివి డాడ్’ అని పిలిచేది. అతను తను పోలీసాఫీసర్‌గా సాధించిన విజయాలు, చూసిన జీవిత కథలను చెబుతుండేవాడు.
మాటల మధ్యలో ఒకరోజు పెగ్లర్‌తో ‘పోలీస్ ఆఫీసర్‌ను కావాలంటే ఏం చేయాలి..’ అని అడిగింది. దాంతో పోలీస్ ఫోర్స్‌లోకి వెళ్లేందుకు మణిదీప్‌కు పెగ్లర్ దారి చూపించాడు. కానీ, అందులో ఇమడటం ఆమెకు అంత సులభం కాలేదు. సంప్రదాయ అడ్డుగోడలను తనకై తాను తొలగించుకోవాల్సి వచ్చింది. కాళ్లు కనిపించేలా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని ఈత నేర్చుకోవడం వంటిది అందులో ఒకటి. ఫిట్‌గా ఉండటానికి 20 కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది.
తిరస్కారానికి గురైనా మానని ప్రయత్నం
2002లో పిల్లలను న్యూజిలాండ్‌కు తెప్పించుకుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత మణిదీప్ మొదటిసారి పోలీసు యూనిఫామ్ ధరించింది. సమయం గడిచేకొద్దీ ఎంత కష్టమైనా సరే కమాండింగ్ చేసే పొజిషన్‌కు రావాలనుకుంది. ముందు సెటిలర్స్ బాధితులకు మద్దతునిచ్చే సీనియర్ కానిస్టేబుల్. తరువాత, ప్రమోషన్ల కోసం ప్రతీసారీ అప్లై చేసుకుంటూనే ఉంది. ప్రతిసారీ రిజెక్ట్ అయ్యేది. కానీ, ఏ మాత్రం పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించింది.
మణిదీప్ కౌర్‌కు సీనియర్ సార్జంట్ బ్యాడ్జ్ ఇస్తున్న అధికారులు
‘న్యూజిలాండ్ వలస వచ్చినవారికి వారికి తమ జాతి ప్రజల తరపున పోలీసు బలగాలలో ప్రాతినిధ్యం వహించడం ఎంత ముఖ్యమో పెగ్లర్ చెప్పడం నాకు బాగా గుర్తు. అందుకే, నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండేదాన్ని. అలా ప్రయత్నం ఫలించి సీనియర్ సార్జెంట్ పదోన్నతి లభించింది’ అని ఆనందంగా చెబుతుంది మణిదీప్ కౌర్. న్యూజిలాండ్ పోలీసు విభాగంలో సీనియర్ సార్జెంట్ హోదాకు చేరుకున్న భారతదేశపు మొదటి మహిళ మణిదీప్ కౌర్. ఇప్పుడు ఆమె వయసు 52 ఏళ్లు. ఆమె పిల్లలు ఇద్దరూ పెద్దవారయ్యారు. మనవరాళ్ళు కూడా ఉన్నారు.
కుటుంబ సభ్యులతో మణిదీప్ కౌర్
‘మా అమ్మానాన్నలు, పిల్లలు, మా సిబ్బంది, అధికారులతో సహా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగడానికి నాకు సహాయం చేశారు. మీరూ మీ చుట్టూ గమనించండి, సహాయపడే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. అవకాశాల కోసం వెతకండి. సాధించాల్సిన వాటిని చేరుకోండి. మీలో ఒక వైవిధ్యం చూపడానికి వాటిని పట్టుకోండి, అప్పుడు మీరు ప్రపంచానికే ఒక వైవిధ్యం చూపచ్చు’ అంటోంది మణిదీప్ కౌర్. ‘ఈ దేశాన్ని వలసదారుల పిల్లలు సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేనంత సురక్షితంగా మార్చడం నా విధుల్లో ముఖ్యమైనది’ అనే ఈ సార్జెంట్‌ది ఎన్నో షేడ్స్ ఉన్న స్ఫూర్తినిచ్చే కథ.
ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. భర్త నుంచి పిల్లలను తెచ్చుకోవడానికి పోరాడింది. బతుకు తెరువుకై పిల్లలను కొంతకాలం విడిచిపెట్టాల్సి వచ్చింది. తల్లి మాత్రమే ఊహించగల భయంకరమైన నొప్పి అది. పరాయిదేశంలో జీవించి, ప్రతిరోజూ కష్టపడి, అనేక అసమానతలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగే వేసింది. ఇక మరో దారిలేక జీవితమే ఆమె దారిలోకి వచ్చింది. ఆమెను రోల్ మోడల్‌గా నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment