Mandeep
-
‘షూటౌట్’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు!
అంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో అర్జెంటీనాపై నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2–2తో సమంగా నిలిచాయి.భారత్ తరఫున మన్దీప్ (11వ ని.లో), లలిత్ (55వ ని.లో)... అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (20వ ని.లో), థామస్ డొమినె (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ చెరో రెండు గోల్స్ చేయగా, అభిషేక్ ఒక గోల్ చేశాడు. రాజ్‌కుమార్, లలిత్ విఫలమయ్యారు.ప్రత్యర్థి జట్టులో మైకో రెండు గోల్స్ కొట్టగా, లుకాస్, టోబియస్ ఒక్కో గోల్ చేశారు. ముగ్గురు విఫలమవడంతో భారత్ నెగ్గింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–5 గోల్స్‌తో అర్జెంటీనా చేతిలో ఓడింది.ఇవి చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు కన్నుమూశారు. మన్దీప్ రాయ్ (74) బెంగళూరులో గుండెపోటుతో మరణించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్దీప్ రాయ్ ఆదివారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణంపై ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు వెంకట్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మన్దీప్ రాయ్ బెంగాలీ అయినప్పటికీ బెంగళూరులో స్థిరపడి కన్నడ చిత్ర పరిశ్రమలో నటించారని తెలిపారు. కన్నడ పరిశ్రమతో గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. మన్దీప్ రాయ్ నటించిన చిత్రాలు వరుసగా 'మించిన ఓట', 'పుష్పక విమానం', 'దేవర ఆట', 'నాగరహావు', 'ఆప్త రక్షక', 'అమృతధారే', 'కురిగాలు సార్ కురిపాలు' వంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. Mandeep Roy | Originally Bengali, Settled and Acted in Kannada Film Industry, Closely Connected to #Kannada #People He is Unforgettable in #Pushpaka Vimana #RIP #MandeepRoy #KFI #Kannada pic.twitter.com/TcP5EBNsFg — Venkat Bharadwaj (@csvenkat) January 29, 2023 -
పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి..
న్యూజిలాండ్ పోలీసు విభాగంలో సీనియర్ సార్జెంట్ హోదాకు చేరుకున్న భారతదేశపు మొట్టమొదటి మహిళ మణిదీప్ కౌర్. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఏ మాత్రం పరిచయం లేని ప్రపంచంలో ఆఫీసర్ స్థాయికి ఎలా చేరిందో తెలుసుకోవాలంటే మణిదీప్ కౌర్ కథ తెలుసుకోవాలి. సంప్రదాయ పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది మణిదీప్ కౌర్. పద్దెనిమిదో ఏట పెళ్లి చేసేశారు ఇంట్లో. పెళ్లయిన ఏడాదికే మొదటి బిడ్డ. అర్ధంతరంగా ఆగిపోయిన కాలేజీ చదువు. ఇద్దరు పిల్లలు, బాధ్యతారాహిత్యంగా ఉండే భర్త. ప్రతిరోజూ గొడవల కాపురం. విసిగి వేసారి తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి విడాకులిచ్చి పుట్టింటికి చేరింది ఇద్దరు పిల్లలను వెంటేసుకొని. ఆర్థికంగా ఎవరిమీదా ఆధాపడకుండా బతకాలన్న ఆశ ఆమెను ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేలా చేసింది. సేల్స్ ఉమన్‌గా ఉద్యోగంలో చేరింది. ఇంటింటికీ వెళ్లి మా టెలిఫోన్ సేవలకు మారమని కస్టమర్లను ఒప్పించే పని అది. ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అందుకని, చెప్పవలసిన నాలుగు మాటలను కాగితంపై రాసుకొని, కస్టమర్లకు ఇచ్చేది. పని చేసే చోట న్యూజిలాండ్‌లో టాక్సీ నడుపుకునైనా బాగా బతకచ్చనే మాటలు వింది. టాక్సీ డ్రైవర్‌గా! అలా, 27 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలి, న్యూజిలాండ్‌కి ప్రయాణమైంది. ఆక్లాండ్‌లోని వైఎంసిఎ మహిళల లాడ్జిలో బస. టాక్సీడ్రైవర్గా జీవనం. ఆ లాడ్జిలో జాన్పెగ్లర్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నైట్‌టైమ్ రిసెప్షనిస్ట్‌గా పనిచేసేవాడు. రోజూ వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు పెగ్లర్తో మాటలు కలిశాయి. కొన్ని రోజుల్లోనే ఇద్దరికీ సంభాషణ పెరిగింది. మణిదీప్ పెగ్లర్ని ‘కివి డాడ్’ అని పిలిచేది. అతను తను పోలీసాఫీసర్‌గా సాధించిన విజయాలు, చూసిన జీవిత కథలను చెబుతుండేవాడు. మాటల మధ్యలో ఒకరోజు పెగ్లర్తో ‘పోలీస్ ఆఫీసర్‌ను కావాలంటే ఏం చేయాలి..’ అని అడిగింది. దాంతో పోలీస్ ఫోర్స్‌లోకి వెళ్లేందుకు మణిదీప్‌కు పెగ్లర్ దారి చూపించాడు. కానీ, అందులో ఇమడటం ఆమెకు అంత సులభం కాలేదు. సంప్రదాయ అడ్డుగోడలను తనకై తాను తొలగించుకోవాల్సి వచ్చింది. కాళ్లు కనిపించేలా స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని ఈత నేర్చుకోవడం వంటిది అందులో ఒకటి. ఫిట్‌గా ఉండటానికి 20 కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది. తిరస్కారానికి గురైనా మానని ప్రయత్నం 2002లో పిల్లలను న్యూజిలాండ్‌కు తెప్పించుకుంది. రెండేళ్ల శిక్షణ తర్వాత మణిదీప్ మొదటిసారి పోలీసు యూనిఫామ్ ధరించింది. సమయం గడిచేకొద్దీ ఎంత కష్టమైనా సరే కమాండింగ్ చేసే పొజిషన్‌కు రావాలనుకుంది. ముందు సెటిలర్స్ బాధితులకు మద్దతునిచ్చే సీనియర్ కానిస్టేబుల్. తరువాత, ప్రమోషన్ల కోసం ప్రతీసారీ అప్లై చేసుకుంటూనే ఉంది. ప్రతిసారీ రిజెక్ట్ అయ్యేది. కానీ, ఏ మాత్రం పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించింది. మణిదీప్ కౌర్‌కు సీనియర్ సార్జంట్ బ్యాడ్జ్ ఇస్తున్న అధికారులు ‘న్యూజిలాండ్ వలస వచ్చినవారికి వారికి తమ జాతి ప్రజల తరపున పోలీసు బలగాలలో ప్రాతినిధ్యం వహించడం ఎంత ముఖ్యమో పెగ్లర్ చెప్పడం నాకు బాగా గుర్తు. అందుకే, నా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండేదాన్ని. అలా ప్రయత్నం ఫలించి సీనియర్ సార్జెంట్ పదోన్నతి లభించింది’ అని ఆనందంగా చెబుతుంది మణిదీప్ కౌర్. న్యూజిలాండ్ పోలీసు విభాగంలో సీనియర్ సార్జెంట్ హోదాకు చేరుకున్న భారతదేశపు మొదటి మహిళ మణిదీప్ కౌర్. ఇప్పుడు ఆమె వయసు 52 ఏళ్లు. ఆమె పిల్లలు ఇద్దరూ పెద్దవారయ్యారు. మనవరాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో మణిదీప్ కౌర్ ‘మా అమ్మానాన్నలు, పిల్లలు, మా సిబ్బంది, అధికారులతో సహా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగడానికి నాకు సహాయం చేశారు. మీరూ మీ చుట్టూ గమనించండి, సహాయపడే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. అవకాశాల కోసం వెతకండి. సాధించాల్సిన వాటిని చేరుకోండి. మీలో ఒక వైవిధ్యం చూపడానికి వాటిని పట్టుకోండి, అప్పుడు మీరు ప్రపంచానికే ఒక వైవిధ్యం చూపచ్చు’ అంటోంది మణిదీప్ కౌర్. ‘ఈ దేశాన్ని వలసదారుల పిల్లలు సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేనంత సురక్షితంగా మార్చడం నా విధుల్లో ముఖ్యమైనది’ అనే ఈ సార్జెంట్ది ఎన్నో షేడ్స్ ఉన్న స్ఫూర్తినిచ్చే కథ. ఆమె వైవాహిక జీవితం దెబ్బతింది. భర్త నుంచి పిల్లలను తెచ్చుకోవడానికి పోరాడింది. బతుకు తెరువుకై పిల్లలను కొంతకాలం విడిచిపెట్టాల్సి వచ్చింది. తల్లి మాత్రమే ఊహించగల భయంకరమైన నొప్పి అది. పరాయిదేశంలో జీవించి, ప్రతిరోజూ కష్టపడి, అనేక అసమానతలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగే వేసింది. ఇక మరో దారిలేక జీవితమే ఆమె దారిలోకి వచ్చింది. ఆమెను రోల్ మోడల్‌గా నిలిపింది. -
పసిడి పోరుకు భారత్
ఇపో (మలేసియా): కొత్త సీజన్లో భారత పురుషుల హాకీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్లో టీమిండియా మూడో విజయంతో పసిడి పతకం కోసం జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కెనడా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7–3 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున 24 ఏళ్ల మన్దీప్ సింగ్ (20వ, 27వ, 29వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించగా... వరుణ్ కుమార్ (12వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (39వ నిమిషంలో), వివేక్ ప్రసాద్ (55వ నిమిషంలో), నీలకంఠ శర్మ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కెనడా జట్టుకు మార్క్ పియర్సన్ (35వ నిమిషంలో), ఫిన్ బూత్రాయ్డ్ (50వ నిమిషంలో), జేమ్స్ వాలెస్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోల్స్ పరంగా కెనడాపై భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు కెనడాతో 16 మ్యాచ్‌లు ఆడిన భారత్ 12 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడి, ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పోలాండ్‌తో భారత్ ఆడుతుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టైటిల్ కోసం తలపడతాయి. ప్రస్తుతం భారత్, కొరియా జట్లు 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా నాలుగు జట్లకు పది పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో భారత్, కొరియా జట్లు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరుకున్నాయి. గతేడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో కెనడాపై 5–1తో నెగ్గిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ కెనడాపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలోనే వరుణ్ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత రెండో క్వార్టర్లో చెలరేగింది. ముఖ్యంగా మన్దీప్ సింగ్ తొమ్మిది నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత కెనడా ఆటగాళ్లు తేరుకొని ఖాతా తెరిచినా... భారత దూకుడును అడ్డుకోలేకపోయారు. చివరి పది నిమిషాల్లో కెనడా రెండు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. -
హరారేలో హైరానా...
► చివరి బంతికి గెలిచిన భారత్ ► 3 పరుగులతో ఓడిన జింబాబ్వే ► 2-1తో టి20 సిరీస్ ధోనిసేన సొంతం ► రాణించిన జాదవ్, బౌలర్లు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో చేసింది 138 పరుగులే... అయితే దానిని కాపాడుకునేందుకు భారత జట్టు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఆఖరి బంతి దాకా తీసుకొచ్చిన జట్టు నానా హైరానా పడి చివరకు గట్టెక్కింది. సిరీస్ ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా, ఒక దశలో పరాజయం తప్పదనిపిస్తుండగా... ధోని సేన కోలుకొని జింబాబ్వే పర్యటనను విజయంతో ముగించింది. ఆఖరి ఓవర్లో చేయాల్సిన 21 పరుగుల కోసం తుది వరకు పోరాడినా... మ్యాచ్ గెలవడం జింబాబ్వే వల్ల కాలేదు. మొత్తానికి కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ప్రయోగాల పర్యటన క్రతువు పూర్తి చేసుకుంది. హరారే: జింబాబ్వే విజయానికి చివరి బంతికి 4 పరుగులు కావాలి... తొలి మ్యాచ్‌లో ధోని అంతటివాడే కొట్టలేకపోయాడు. చిగుంబురా కొట్టగలడా అనే సందేహం. ఆ ఓవర్లో బరీందర్ ఐదు బంతుల్లో 17 పరుగులిచ్చేయడంతో జింబాబ్వే శిబిరంలో ధీమా. అయితే చివరి బంతిని భారీ షాట్ ఆడబోయిన చిగుంబురా, చహల్ చేతికి చిక్కాడు. భారత కుర్రాళ్లలో అమితానందం కనిపించగా... చక్కటి అవకాశం చేజార్చుకొని జింబాబ్వే నిరాశలో మునిగింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 3 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేదార్ జాదవ్ (42 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిబాందా (21 బంతుల్లో 26; 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ధావల్, బరీందర్ చెరో 2 వికెట్లు తీశారు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. అంతకు ముందు వన్డే సిరీస్‌ను కూడా జట్టు 3-0తో సొంతం చేసుకుంది. 6 వికెట్లు తీసిన బరీందర్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కీలక భాగస్వామ్యం భారత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రాహుల్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. వరుసగా 4, 6, 4 బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. అయితే మన్దీప్ (4)ను తిరిపానో అవుట్ చేయగా, మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో రాహుల్, పాండే (0)లు వెనుదిరిగారు. దాంతో జట్టు 27 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాయడు (20), జాదవ్ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 49 బంతుల్లో 49 పరుగులు జోడించారు. అయితే పిచ్ మరీ నెమ్మదిగా ఉండడం, జింబాబ్వే చక్కటి బౌలింగ్‌లో 10-17 మధ్య 8 ఓవర్లలో భారత్ 46 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని (9) ప్రభావం చూపలేకపోయినా... జాదవ్ దూకుడుగా ఆడటంతో ఆఖరి మూడు ఓవర్లలో జట్టు 43 పరుగులు చేసింది. పోరాడినా... ఛేదనలో జింబాబ్వే త్వరగానే చిబాబా (5) వికెట్ కోల్పోయింది. అయితే మసకద్జ (15), సిబాందా రెండో వికెట్‌కు 37 బంతుల్లో 40 పరుగులు జత చేసి జట్టును నడిపించారు. తర్వాత వచ్చిన మూర్ (21 బంతుల్లో 26; 3 సిక్సర్లు) కూడా ఆధిపత్యం ప్రదర్శించాడు. చహల్ బౌలింగ్‌లో అతను మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో జింబాబ్వే గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే మూర్‌ను అవుట్ చేసి చహల్ బదులు తీర్చుకోగా, వాలర్ (10) విఫలమయ్యాడు. చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోవడంతో జింబాబ్వే ఒత్తిడికి లోనైంది. ఆఖర్లో మరుమా (23 నాటౌట్), చిగుంబురా (16) పోరాడినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) మద్జివ 22; మన్దీప్ (సి) మరుమా (బి) తిరిపానో 4; రాయుడు (సి) చిగుంబురా (బి) క్రీమర్ 20; పాండే రనౌట్ 0; జాదవ్ (సి) చిగుంబురా (బి) తిరిపానో 58; ధోని (బి) తిరిపానో 9; అక్షర్ నాటౌట్ 20; ధావల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-20; 2-27; 3-27; 4-76; 5-93; 6-122. బౌలింగ్: చటారా 4-1-34-0; తిరిపానో 4-0-20-3; మద్జివ 4-0-32-1; చిబాబా 4-0-19-0; క్రీమర్ 4-0-32-1. జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (సి) చహల్ (బి) బరీందర్ 5; మసకద్జా (ఎల్బీ) (బి) అక్షర్ 15; సిబాందా (ఎల్బీ) (బి) ధావల్ 28; మూర్ (సి) మన్దీప్ (బి) చహల్ 26; వాలర్ (సి) బుమ్రా (బి) ధావల్ 10; చిగుంబురా (సి) చహల్ (బి) బరీందర్ 16; మరుమా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1-17; 2-57; 3-60; 4-86; 5-104; 6-135. బౌలింగ్: బరీందర్ 4-1-31-2; ధావల్ 4-0-23-2; బుమ్రా4-0-23-0; అక్షర్4-0-18-1; చహల్4-0-32-1. ► 324 మూడు ఫార్మాట్లలోకలిపి ధోని కెప్టెన్‌గా వ్యవహరించిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య. నంబర్‌వన్ స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (324) రికార్డును ధోని సమం చేశాడు.