ఇపో (మలేసియా): కొత్త సీజన్‌లో భారత పురుషుల హాకీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్‌లో టీమిండియా మూడో విజయంతో పసిడి పతకం కోసం జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కెనడా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7–3 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున 24 ఏళ్ల మన్‌దీప్ సింగ్ (20వ, 27వ, 29వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించగా... వరుణ్ కుమార్ (12వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (39వ నిమిషంలో), వివేక్ ప్రసాద్ (55వ నిమిషంలో), నీలకంఠ శర్మ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కెనడా జట్టుకు మార్క్ పియర్సన్ (35వ నిమిషంలో), ఫిన్ బూత్‌రాయ్డ్ (50వ నిమిషంలో), జేమ్స్ వాలెస్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
గోల్స్ పరంగా కెనడాపై భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు కెనడాతో 16 మ్యాచ్‌లు ఆడిన భారత్ 12 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడి, ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పోలాండ్‌తో భారత్ ఆడుతుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టైటిల్ కోసం తలపడతాయి.
ప్రస్తుతం భారత్, కొరియా జట్లు 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా నాలుగు జట్లకు పది పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో భారత్, కొరియా జట్లు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరుకున్నాయి.
గతేడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో కెనడాపై 5–1తో నెగ్గిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ కెనడాపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలోనే వరుణ్ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో చెలరేగింది. ముఖ్యంగా మన్‌దీప్ సింగ్ తొమ్మిది నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత కెనడా ఆటగాళ్లు తేరుకొని ఖాతా తెరిచినా... భారత దూకుడును అడ్డుకోలేకపోయారు. చివరి పది నిమిషాల్లో కెనడా రెండు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది.
పసిడి పోరుకు భారత్
Published Thu, Mar 28 2019 12:40 AM | Last Updated on Thu, Mar 28 2019 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment