Sultan Azlan Shah Cup
-
పసిడి పోరుకు భారత్
ఇపో (మలేసియా): కొత్త సీజన్లో భారత పురుషుల హాకీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్లో టీమిండియా మూడో విజయంతో పసిడి పతకం కోసం జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కెనడా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7–3 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున 24 ఏళ్ల మన్దీప్ సింగ్ (20వ, 27వ, 29వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించగా... వరుణ్ కుమార్ (12వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (39వ నిమిషంలో), వివేక్ ప్రసాద్ (55వ నిమిషంలో), నీలకంఠ శర్మ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కెనడా జట్టుకు మార్క్ పియర్సన్ (35వ నిమిషంలో), ఫిన్ బూత్రాయ్డ్ (50వ నిమిషంలో), జేమ్స్ వాలెస్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోల్స్ పరంగా కెనడాపై భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు కెనడాతో 16 మ్యాచ్‌లు ఆడిన భారత్ 12 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడి, ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పోలాండ్‌తో భారత్ ఆడుతుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టైటిల్ కోసం తలపడతాయి. ప్రస్తుతం భారత్, కొరియా జట్లు 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా నాలుగు జట్లకు పది పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో భారత్, కొరియా జట్లు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరుకున్నాయి. గతేడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో కెనడాపై 5–1తో నెగ్గిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ కెనడాపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలోనే వరుణ్ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత రెండో క్వార్టర్లో చెలరేగింది. ముఖ్యంగా మన్దీప్ సింగ్ తొమ్మిది నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత కెనడా ఆటగాళ్లు తేరుకొని ఖాతా తెరిచినా... భారత దూకుడును అడ్డుకోలేకపోయారు. చివరి పది నిమిషాల్లో కెనడా రెండు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది. -
కుర్రాళ్లతో ‘అజ్లాన్ షా’ టోర్నీకి భారత్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) బుధవారం ప్రకటించింది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కాగా 18 మంది సభ్యుల జట్టులో కుర్రాళ్లకు చోటు దక్కింది. మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. డిఫెండర్ సురేందర్ కుమార్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మలేసియాలోని ఐపోలో ఈ నెల 23 నుంచి 30 వరకు అజ్లాన్ షా హాకీ టోర్నీ జరుగుతుంది. భారత్, ఆతిథ్య మలేసియాతో పాటు కెనడా, కొరియా, దక్షిణాఫ్రికా, జపాన్ జట్లు ఇందులో తలపడతాయి. 23న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌తో ఆడనుంది. అనుభవజ్ఞులైన ఫార్వర్డ్ ఆటగాళ్లు సునీల్, ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, లలిత్ ఉపా«ధ్యాయ్లతో పాటు డిఫెండర్లు రూపిందర్ పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, మిడ్‌ఫీల్డర్ చింగ్లేసన సింగ్‌లు గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. వీళ్లందరికీ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) సెంటర్లో పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఐ ప్రకటించింది. ఈ నెల 18న భారత హాకీ జట్టు మలేసియాకు బయల్దేరుతుంది. భారత హాకీ జట్టు: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), సురేందర్ (వైస్ కెప్టెన్), శ్రీజేశ్ (గోల్ కీపర్), క్రిషన్ పాఠక్, గురీందర్ సింగ్, వరుణ్ కుమార్, బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్, కొతాజిత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, సుమీత్, వివేక్ సాగర్ ప్రసాద్, మన్దీప్ సింగ్, సిమ్రాన్‌జిత్ సింగ్, గుర్జంత్ సింగ్, శిలానంద్ లక్రా, సుమిత్ కుమార్. -
ఫైనల్‌కు చేరిన భారత్
ఇఫో(మలేషియా): సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 6-1 తేడాతో ఆతిథ్య మలేషియా జట్టును మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆద్యంతం అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్ కు చేర్చారు. భారత ఆటగాళ్లలో రణ్ దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా, నిక్కిన్ తిమ్మయ్యా, హర్ జీత్ సింగ్, దానిష్ ముజ్ తబా, తల్వీందర్ సింగ్‌లు తలో గోల్ చేసి జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. దీంతో ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరుకు భారత్ సిద్ధమైంది. ఆట 5 వ నిమిషంలో భారత ఆటగాడు నిక్కిన్ తిమ్మయ్యా తొలి గోల్ చేసి అదరగొట్టే ఆరంభాన్ని అందించాడు. ఆ తరువాత ఏడో నిమిషంలో హర్ జీత్ సింగ్ గోల్ సాధించడంతో భారత్ కు 2-0 ఆధిక్యం దక్కింది. రెండో క్వార్టర్ లో భాగంగా ఆట 25వ నిమిషంలో రణ్ దీప్ సింగ్ చాకచక్యంగా గోల్ చేయడంతో భారత జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలింది. మూడో గోల్ చేసిన రెండు నిమిషాల వ్యవధిలో దానిష్ ముజ్ తబా గోల్ చేయడంతో భారత జట్టు 4-0తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మూడో క్వార్టర్ లో రణ్ దీప్ సింగ్ మరో గోల్ చేయడంతో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. కాగా, ఆట చివరి క్వార్టర్ ఆదిలో మలేషియా ఆటగాడు షహ్రిల్ గోల్ సాధించడంతో ఆజట్టుకు ఊరట లభించింది. అయితే ఆట ముగిసే క్రమంలో తల్వీందర్ సింగ్ గోల్ చేయడంతో భారత 6-1 తేడాతో విజయం నమోదు చేసి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ తుది పోరుపై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. -
అజ్లాన్ షా హాకీ: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓటమి
ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో జపాన్ ను ఓడించి శుభారంభం చేసిన భారత్.. రెండో మ్యాచ్ లో మాత్రం పటిష్టమైన ఆస్టేలియాను నిలువరించడంలో విఫలమైంది. ఆట ఐదో నిమిషంలోనే బ్లాక్ గోవర్స్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచి ఆస్ట్రేలియాను ఆధిక్యంలోకి తీసుకువెళ్లాడు. అయితే ఎనిమిదో నిమిషంలో భారత ప్లేయర్ రూపేందర్ సింగ్ గోల్ చేయడంతో స్కోరు సమం అయ్యింది. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో డేవ్ వెటన్ ఇచ్చిన పాస్ ను అందుకున్న కోలీ గోల్ గా మలచడంతో ఆస్ట్రేలియా తొలి క్వార్టర్ ముగిసే సరికి 2-1 ఆధిక్యం సాధించింది. ఇక రెండో క్వార్టర్ లో కూడా ఆస్ట్రేలియా అదే ఊపును కొనసాగించింది. ఆట 20వ, 26వ నిమిషంలో ఆస్ట్రేలియా వరుస గోల్స్ సాధించి స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట చివరి క్వార్టర్ లో ఆస్ట్రేలియా మరో గోల్ చేసి 5-1తేడాతో ఘన విజయం సాధించింది.