ఫైనల్కు చేరిన భారత్
ఇఫో(మలేషియా): సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్లో భారత్ 6-1 తేడాతో ఆతిథ్య మలేషియా జట్టును మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఆద్యంతం అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్ కు చేర్చారు. భారత ఆటగాళ్లలో రణ్ దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా, నిక్కిన్ తిమ్మయ్యా, హర్ జీత్ సింగ్, దానిష్ ముజ్ తబా, తల్వీందర్ సింగ్లు తలో గోల్ చేసి జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. దీంతో ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరుకు భారత్ సిద్ధమైంది.
ఆట 5 వ నిమిషంలో భారత ఆటగాడు నిక్కిన్ తిమ్మయ్యా తొలి గోల్ చేసి అదరగొట్టే ఆరంభాన్ని అందించాడు. ఆ తరువాత ఏడో నిమిషంలో హర్ జీత్ సింగ్ గోల్ సాధించడంతో భారత్ కు 2-0 ఆధిక్యం దక్కింది. రెండో క్వార్టర్ లో భాగంగా ఆట 25వ నిమిషంలో రణ్ దీప్ సింగ్ చాకచక్యంగా గోల్ చేయడంతో భారత జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలింది. మూడో గోల్ చేసిన రెండు నిమిషాల వ్యవధిలో దానిష్ ముజ్ తబా గోల్ చేయడంతో భారత జట్టు 4-0తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మూడో క్వార్టర్ లో రణ్ దీప్ సింగ్ మరో గోల్ చేయడంతో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. కాగా, ఆట చివరి క్వార్టర్ ఆదిలో మలేషియా ఆటగాడు షహ్రిల్ గోల్ సాధించడంతో ఆజట్టుకు ఊరట లభించింది. అయితే ఆట ముగిసే క్రమంలో తల్వీందర్ సింగ్ గోల్ చేయడంతో భారత 6-1 తేడాతో విజయం నమోదు చేసి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ తుది పోరుపై పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు.