హరారేలో హైరానా... | 2-1 MS Dhoni won the Twenty20 series | Sakshi
Sakshi News home page

హరారేలో హైరానా...

Published Thu, Jun 23 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

హరారేలో హైరానా...

హరారేలో హైరానా...

చివరి బంతికి గెలిచిన భారత్
3 పరుగులతో ఓడిన జింబాబ్వే
2-1తో టి20 సిరీస్ ధోనిసేన సొంతం
రాణించిన జాదవ్, బౌలర్లు
 

బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో చేసింది 138 పరుగులే... అయితే దానిని కాపాడుకునేందుకు భారత జట్టు పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఆఖరి బంతి దాకా తీసుకొచ్చిన జట్టు నానా హైరానా పడి చివరకు గట్టెక్కింది. సిరీస్ ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా, ఒక దశలో పరాజయం తప్పదనిపిస్తుండగా... ధోని సేన కోలుకొని జింబాబ్వే పర్యటనను విజయంతో ముగించింది. ఆఖరి ఓవర్లో చేయాల్సిన 21 పరుగుల కోసం తుది వరకు పోరాడినా... మ్యాచ్ గెలవడం జింబాబ్వే వల్ల కాలేదు. మొత్తానికి కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ప్రయోగాల పర్యటన క్రతువు పూర్తి చేసుకుంది.
 
 
హరారే: జింబాబ్వే విజయానికి చివరి బంతికి 4 పరుగులు కావాలి... తొలి మ్యాచ్‌లో ధోని అంతటివాడే కొట్టలేకపోయాడు. చిగుంబురా కొట్టగలడా అనే సందేహం. ఆ ఓవర్లో బరీందర్ ఐదు బంతుల్లో 17 పరుగులిచ్చేయడంతో జింబాబ్వే శిబిరంలో ధీమా. అయితే చివరి బంతిని భారీ షాట్ ఆడబోయిన చిగుంబురా, చహల్ చేతికి చిక్కాడు. భారత కుర్రాళ్లలో అమితానందం కనిపించగా... చక్కటి అవకాశం చేజార్చుకొని జింబాబ్వే నిరాశలో మునిగింది. బుధవారం ఇక్కడ జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత్ 3 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేదార్ జాదవ్ (42 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిబాందా (21 బంతుల్లో 26; 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ధావల్, బరీందర్ చెరో 2 వికెట్లు తీశారు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. అంతకు ముందు వన్డే సిరీస్‌ను కూడా జట్టు 3-0తో సొంతం చేసుకుంది. 6 వికెట్లు తీసిన బరీందర్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.


కీలక భాగస్వామ్యం
భారత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రాహుల్ (20 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. వరుసగా 4, 6, 4 బాదడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. అయితే మన్‌దీప్ (4)ను తిరిపానో అవుట్ చేయగా, మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో రాహుల్, పాండే (0)లు వెనుదిరిగారు. దాంతో జట్టు 27 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాయడు (20), జాదవ్ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ  నాలుగో వికెట్‌కు 49 బంతుల్లో 49 పరుగులు జోడించారు. అయితే పిచ్ మరీ నెమ్మదిగా ఉండడం, జింబాబ్వే చక్కటి బౌలింగ్‌లో 10-17 మధ్య 8 ఓవర్లలో భారత్ 46 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని (9) ప్రభావం చూపలేకపోయినా... జాదవ్ దూకుడుగా ఆడటంతో ఆఖరి మూడు ఓవర్లలో జట్టు 43 పరుగులు చేసింది.


పోరాడినా...
ఛేదనలో జింబాబ్వే త్వరగానే చిబాబా (5) వికెట్ కోల్పోయింది. అయితే మసకద్జ (15), సిబాందా రెండో వికెట్‌కు 37 బంతుల్లో 40 పరుగులు జత చేసి జట్టును నడిపించారు. తర్వాత వచ్చిన మూర్ (21 బంతుల్లో 26; 3 సిక్సర్లు) కూడా ఆధిపత్యం ప్రదర్శించాడు.  చహల్ బౌలింగ్‌లో అతను మూడు భారీ సిక్సర్లు కొట్టడంతో జింబాబ్వే గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అయితే మూర్‌ను అవుట్ చేసి చహల్ బదులు తీర్చుకోగా, వాలర్ (10) విఫలమయ్యాడు. చేయాల్సిన రన్‌రేట్ బాగా పెరిగిపోవడంతో జింబాబ్వే ఒత్తిడికి లోనైంది. ఆఖర్లో మరుమా (23 నాటౌట్), చిగుంబురా (16) పోరాడినా ఫలితం లేకపోయింది.


స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) మద్జివ 22; మన్‌దీప్ (సి) మరుమా (బి) తిరిపానో 4; రాయుడు (సి) చిగుంబురా (బి) క్రీమర్ 20; పాండే రనౌట్ 0; జాదవ్ (సి) చిగుంబురా (బి) తిరిపానో 58; ధోని (బి) తిరిపానో 9; అక్షర్ నాటౌట్ 20; ధావల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 138.        

వికెట్ల పతనం: 1-20; 2-27; 3-27; 4-76; 5-93; 6-122.
బౌలింగ్: చటారా 4-1-34-0; తిరిపానో 4-0-20-3; మద్జివ 4-0-32-1; చిబాబా 4-0-19-0; క్రీమర్ 4-0-32-1.


జింబాబ్వే ఇన్నింగ్స్: చిబాబా (సి) చహల్ (బి) బరీందర్ 5; మసకద్జా (ఎల్బీ) (బి) అక్షర్ 15; సిబాందా (ఎల్బీ) (బి) ధావల్ 28; మూర్ (సి) మన్‌దీప్ (బి) చహల్ 26; వాలర్ (సి) బుమ్రా (బి) ధావల్ 10; చిగుంబురా (సి) చహల్ (బి) బరీందర్ 16; మరుమా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135.   

వికెట్ల పతనం: 1-17; 2-57; 3-60; 4-86; 5-104; 6-135.
బౌలింగ్: బరీందర్ 4-1-31-2; ధావల్ 4-0-23-2; బుమ్రా4-0-23-0; అక్షర్4-0-18-1; చహల్4-0-32-1.
 
324 మూడు ఫార్మాట్‌లలోకలిపి ధోని కెప్టెన్‌గా వ్యవహరించిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య. నంబర్‌వన్ స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (324) రికార్డును ధోని సమం చేశాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement