యూపీ సీఎం మరో కీలక నిర్ణయం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇద్దరు కేబినెట్ మంత్రులను తొలగించిన మరుసటి రోజే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ను తప్పించి, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ భట్నాగర్ను ఈ పదవిలో నియమించారు. అఖిలేష్ తాజా నిర్ణయం బాబాయ్, సీనియర్ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్కు చేదువార్త. ఎందుకంటే శివపాల్కు దీపక్ సంఘాల్ చాలా సన్నిహితుడు.
అఖిలేష్ తండ్రి, శివపాల్ సోదరుడు, ఎస్పీ చీఫ్ ములయాం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీపక్ కీలక బాధ్యతలు చేపట్టారు. చాలాకాలంగా ఆయన శివపాల్తో సన్నిహితంగా ఉంటున్నారు. రెండు నెలల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దీపక్పై అఖిలేష్ వేటువేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇటీవల ఖ్వామి ఏక్తాదళ్ను ఎస్పీలో విలీనం చేసుకునే విషయంలో బాబాయ్ శివపాల్తో అఖిలేష్ విభేదించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినా.. ములయాం జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా అఖిలేష్ తాజా నిర్ణయం శివపాల్కు అసంతృప్తి కలిగించేదేనని ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.