తిట్టుకు పది కోట్ల రూపాయలా?
తిట్టే కదా అని తేలిగ్గా తీసి పారేయకండి. మనుషుల మధ్య తగాదాలు పెట్టడానికి తప్పా దేనికి పనికి రాదని నిందించకండి. నోటి తీట తీర్చడానికే తిట్లున్నాయని అపార్థం చేసుకోకండి. తిట్లపురాణమే లేకపోమే వర్తమాన రాజకీయం చప్పాగా సాగుతుందని వేరే చెప్పక్కర్లేదు. తిట్టడం, తిట్టించుకోవడం తెలిసిన వాడే నయా రాజకీయ రంగంలో రాణిస్తాడని కళ్ల ముందే ఎన్నో రుజువులు సాక్షాత్కరిస్తున్నాయి.
ఒక్కోసారి తిట్టు కూడా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. సినిమాల్లో ప్రతినాయకుడిని కథానాయకుడు నోటికొచ్చినట్టు తిట్టి తన్నితే అభిమానులు పరమానందభరితులవుతారు. అత్తాకోడళ్లు, ఆలుమగల మధ్య తిట్లు సరేసరి. ప్రత్యర్థులను ఘాటు పదజాలంతో నొటికొచ్చినట్టు తిట్టకపోతే మన నేతాశ్రీల్లో చాలా మందికి తోచదు. కొంతమంది నాయకులు వ్యూహాత్మకంగా తమను తిట్టించుకుని ఓట్లు కొల్లగొడుతున్నారు. అధికారంలోకి వచ్చాక జనంతో తిట్టించుకుంటున్నారు.
ఎన్నికల్లో నాయకులు పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజం. తిట్టుకోసం కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారని తాజాగా వెల్లడైంది. ఉద్యమనేతను విమర్శిస్తే కోట్లు కుమ్మరిస్తామని యువగాంధీ వారూ ఓ నాయకుడికి ఆఫర్ ఇచ్చారట. అయితే తాను సమ్మతించలేదని సదరు నేత సావధానంగా బయటపెట్టడంతో ఈ తిట్టు బాగోతం వెలుగులోకి వచ్చింది.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తే రూ.పదికోట్లు ఇస్తామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనకు ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్సీ రాములునాయక్ వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్ ను విమర్శించాలని రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రాంచందర్‌రావు, జైరాం రమేష్, దిగ్విజయ్‌సింగ్ పలుమార్లు ఫోన్ చేసి కోరారని తెలిపారు. కానీ తాను అందుకు తిరస్కరించడంతో ఫోన్ చేయడం మానేశారని రాములు నాయక్ వివరించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా తిట్టు కూడా తక్కువది కాదని.