
మా ఇంట్లో నానమ్మే బాస్!
అందుకే మహిళా సాధికారత కోసం బిల్లు తెద్దాం: రాహుల్
భోపాల్: ‘మా ఇంట్లో నాన్న(రాజీవ్), బాబాయ్(సంజయ్) ఉండేవారు. అయితే ఇంటికి బాస్ మాత్రం నానమ్మే(ఇందిరాగాంధీ). ఇందులో అనుమానమే లేదు. ఆమే బాస్‌గా ఉండేవారు.. అందుకే మహిళా సాధికారత కోసం మహిళా బిల్లు తెద్దాం. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు సాధికారత కల్పించకపోతే భారత్ శక్తిమంతమైన దేశంగా అవతరించలేదు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో తయారీలో భాగంగా వివిధ వర్గాల అభిప్రాయాల సేకరణ కోసం సోమవారమిక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 250 మంది మహిళలతో ముచ్చటించారు.
మహిళల సాధికారత ఆవశ్యకతను ప్రస్తావిస్తూ ‘మా ఇంట్లో దాదీనే(నానమ్మ) బాస్’ అని నవ్వుతూ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును త్వరగా ఆమోదించాల్సిన అవసరముందని, దానికి మోక్షం లభించకపోతే అన్ని రంగాల్లో మహిళలకు సాధికారత కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ నిర్వహించిన ఈ సమావేశంలో సెక్స్ వర్కర్లు, హిజ్రాలు, సామాజిక కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు తమ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. కొందరు నిర్మొహమాటంగా ధరల పెరుగుదల, వంటగ్యాస్ సమస్యలను లేవనెత్తారు. వారి డిమాండ్లను మేనిఫెస్టోలో చేరుస్తామని రాహుల్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి సారథ్యం వహిస్తున్న ఆయన ఈ సమావేశంలో ఏమన్నారంటే..
చట్టసభల్లో స్త్రీలకు33 శాతం కోటా ఇచ్చేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఉంది. దాన్ని అలాగే వదిలేయలేం. ఈ విషయంలో పార్టీలకూ బాధ్యత ఉంది. బిల్లుకు ఆమోదం లభిస్తుంది. వచ్చే ఐదు, పదేళ్లలో కాంగ్రెస్ మంత్రుల్లో సగం మంది స్త్రీలే ఉంటారు.
దేశంలో మహిళలు ఇప్పటికీ అన్ని రకాలుగా హింసకు గురవుతుండడం బాధాకరం.
మహిళలకు సాధికారత కల్పించడం పెద్ద పోరాటం లాంటిది. మనం పోరాడి గెలవాలి. మా పార్టీతోపాటు పార్లమెంటులో, ప్రభుత్వంలో మహిళలకు విస్తృత ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తాను.
{పతి మహిళా దేశానికి ఆస్తి. నాయకత్వ పదవుల్లో అత్యధికం వారికి దక్కేలా కృషి చేస్తాను.
శక్తిసామర్థ్యాల్లో స్త్రీపురుషుల మధ్య తేడా లేదు. మహిళలకు ఎలాంటి రక్షణా అవసరం లేదు. వారి హక్కులను వారికిస్తే వారిని వారే రక్షించుకుంటారు.