బీఆర్‌ఎస్‌ను కలుపుకొనే కాంగ్రెస్‌ పోరుబాట?  | Congress fight to include BRS? | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను కలుపుకొనే కాంగ్రెస్‌ పోరుబాట? 

Published Sun, Mar 26 2023 2:29 AM | Last Updated on Sun, Mar 26 2023 2:47 AM

Congress fight to include BRS? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ తీరుకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగా ఉన్న పార్టీలు సైతం రాహుల్‌ అనర్హతను ఖండించడం, ఈ విషయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ తమకు అండగా నిలవడంతో విపక్షాలన్నింటినీ ఏకంచేసే అంశాలపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టి పెట్టింది.

ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడుతున్న బీఆర్‌ఎస్‌ సైతం రాహుల్‌కు సంఘీభావం ప్రకటించడం... అనర్హత పూర్తిగా ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణికి నిదర్శనమంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో ఇకపై తాము చేసే ప్రజాపోరాటాలన్నింటినీలో బీఆర్‌ఎస్‌ను భాగస్వామిని చేసుకోవాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.

రాహుల్‌పై అనర్హతను నిరసిస్తూ వచ్చే వారం విపక్ష పార్టీలను కలుపుకొని భారీ కవాతు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇందులో బీఆర్‌ఎస్‌ సైతం పాల్గొనేలా ఆ పార్టీ ఎంపీలతో మాట్లాడాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చి నట్లు చెబుతున్నారు. 

మహిళా బిల్లుపై బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ అండ! 
ఇటీవల మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన నిరాహా దీక్ష సహా రౌండ్‌టేబుల్‌ సమావేశాలకు కాంగ్రెస్‌ను పిలిచినా ఆ పార్టీ ప్రతినిధులెవరూ హాజరు కాలేదు. ఇకపై అలాకాకుండా మహిళా బిల్లుపై బీఆర్‌ఎస్‌ చేపట్టే కార్యక్రమాలకు హాజరు కావడంతోపాటు కవితపై ఈడీ విచారణను నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు ఇతర పక్షాలతో కలిసి పాల్గొనాలనే నిశ్చయానికి వచ్చి నట్లు ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

బీజేపీపై పోరును ఉధృతం చేసే క్రమంలో బాధిత పక్షాలన్నింటినీ కలుపుకోవడం ముఖ్యమని, అందులో బీఆర్‌ఎస్‌ సైతం ఉంటుందని శనివారం ఏఐసీసీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ మాట్లాడుతూ ఓ క్రమపద్ధతిలో విపక్షాల ఐక్యతను నిర్మించాల్సిన అనివార్యత ఏర్పడిందన్నారు. తమకు మద్దతిచ్చి న బీఆర్‌ఎస్‌ సహా అన్ని విపక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement