రజనీకాంత్ కుటుంబానికి నోట్ల రద్దు సెగ!
- జీతాలు చెల్లించకపోవడంతో స్కూల్ డ్రైవర్ల ఆందోళన
చెన్నై: పెద్దనోట్ల రద్దుతో సామాన్యులే కాదు ఏకంగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబం కూడా కష్టాలు ఎదుర్కొంటున్నది. రజనీకాంత్ భార్య లత చెన్నైలో ఒక స్వచ్ఛంద ఆశ్రమ పాఠశాలను నడిపిస్తున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఈ పాఠశాలకు చెందిన డ్రైవర్లు ఆందోళనకు దిగారు.
దక్షిణ చెన్నై వెలాచేరిలో ఉన్న పాఠశాల ప్రాంగణంలో సోమవారం దాదాపు 28మంది డ్రైవర్లు ధర్నా చేపట్టారు. గత ఆరు నెలలుగా నెలాఖరు వారంలోనే తమకు జీతాలు ఇస్తున్నారని, నోట్లను రద్దుచేసిన తర్వాత తమ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని డ్రైవర్లు తెలిపారు. 'గత ఆరునెలలుగా జీతాలు ఆలస్యంగా ఇస్తున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చిన తర్వాత మాకు ఇంతవరకు జీతాలు అందలేదు. మేం ఎలా ఇంటి అద్దెలు చెల్లించాలి. నిత్యావసర వస్తువులు కొనాలి?' అని డ్రైవర్ కే మురళీకృష్ణ తెలిపారు.
అందుకే పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిటనట్టు చెప్పారు. బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం, జయలలిత మృతి, వర్దా తుపాన్ వంటి కారణాలతోనే జీతాలు ఆలస్యమవుతున్నాయని మేనేజ్‌మెంట్ చెప్తోందని, తమ కష్టాల గురించి ఎంతగా విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని డ్రైవర్లు అంటున్నారు.