రజనీ కొత్త పార్టీలోకి భారీగా వలసలు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయం కావడంతో పార్టీ నిర్మాణానికి కావాల్సిన సన్నాహాలు అప్పుడే మొదలయ్యాయి. పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి? పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై రజనీకాంత్ బెంగళూరుకు చెందిన ఓ ఏజెన్సీ సేవలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని ఓటింగ్ సరళిని అధ్యయనం చేయడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన అజెండాను రూపొందించుకోవడంలో ఈ ఏజెన్సీ సేవలందిస్తోంది.
గతవారం తన సన్నిహితులు, శ్రేయోభిలాషులతో నిర్వహించిన సమావేశాల్లోనూ తాను సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు రజనీ సంకేతాలు ఇచ్చాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంటుందని తెలిపాడు. అటు బీజేపీ కూడా రజనీని తమవైపు లాగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. రజనీ సై అంటే ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కూడా ఏర్పాటు చేస్తామని కమలనాథులు వర్తమానం కూడా పంపారు. అంతేకాదు పార్టీ పెట్టడంలో తగినంత సాయం అందజేస్తామని చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో రజనీ, ఆయన సలహాదారులు పార్టీలోకి ప్రముఖ నేతల వలసలపై దృష్టి పెట్టారు. ఇతర పార్టీల్లోని పేరొందిన సీనియర్ రాజకీయ నాయకులను తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీని పటిష్టపరచాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా రజనీ పార్టీలోకి జంప్ చేయబోతున్న ప్రముఖ నాయకుల్లో అన్నాడీఎంకేకు చెందిన పాండ్యరాజన్ కూడా ఉనున్నారని చెప్తున్నారు.
అన్నాడీఎంకే ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా చేసిన పాండ్యరాజన్ ఆ తర్వాత పన్నీర్ సెల్వం గూటికి చేరారు. ఇప్పుడు ఆయన ఓపీఎస్ వర్గంలో అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అలాగే డీఎంకే పక్కనబెట్టేసిన నేత, గతంలో రెండుసార్లు ఎంపీగా, యూపీఏ హయాంలో మంత్రిగా చేసిన ఎస్ జగత్‌రక్షకన్‌ను కూడా తన పార్టీలోకి తీసుకోవాలని రజనీ వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే చెన్నైకి చెందిన అన్నాడీఎంకే నేత, కాంగ్రెస్ నేత కరాటే త్యాగరాజన్ కూడా రజనీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.