
రజనీకాంత్ నా దేవుడు
ఏలూరు : తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తనకు దేవుడులాంటి వ్యక్తి అని సినీనటుడు సుమన్ అన్నారు. తాడేపల్లిగూడెం స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలిసారిగా ఇక్కడకు వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న మిత్రులకు సాయం చేసే వ్యక్తి రజనీకాంత్ అని, తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రజనీ తోడ్పాటునందించారన్నారు. ఆయన మార్గాన్నే తాను అనుసరిస్తున్నానని చెప్పారు.
రజనీకాంత్ ప్రోత్సాహంతోనే శివాజీ చిత్రంలో విలన్‌గా నటించి అవార్డును అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. అన్నమయ్య చిత్రంలో పోషించిన వేంకటేశ్వరస్వామి పాత్రను ఎన్నటికీ మరువలేనని అన్నారు. ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమలతో పాటు హిందీలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ పాత్రలు పోషించడం తన చిరకాల కోరిక అన్నారు. మరో 12 ఏళ్లపాటు సినిమాల్లో నటించాలని ఉందని, అప్పటికి 50 ఏళ్ల సినీ జీవితం పూర్తవుతుందన్నారు. ఇప్పటివరకు 400 సినిమాల్లో నటించానని సుమన్ తెలిపారు.
మార్షల్ ఆర్ట్స్‌పై ప్రచారం
ఇటీవల సమాజంలో చైన్ స్నాచింగ్‌లు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సుమన్ అన్నారు. ఈ దిశగా ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కాలేజీ రోజుల్లోనే కరాటేపై మక్కువ పెంచుకున్నానని, ఈ కారణంగానే తమిళనాడులో కరాటే సుమన్‌గా తనకు పేరు వచ్చిందన్నారు.
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక క్రమశిక్షణ అలవడుతుందని, జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. తన భార్యకు శస్త్రచికిత్స చేయూల్సి వచ్చినా, పాపకు జ్వరం ఉన్న మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరిక మేరకు బ్రాండ్ అంబాసిడర్‌గా తొలి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చానని సుమన్ తెలిపారు.