బాబాయ్పై వేటువేస్తే.. తమ్ముడిని సాగనంపారు
లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో, ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం వేగంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని సంక్షోభంలో పడేశాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ సహా నలుగురు మంత్రులపై వేటువేయగా.. అఖిలేష్కు మద్దతుగా ఉన్న సమీప బంధువు, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ను పార్టీ నుంచి ములాయం బహిష్కరించారు. రాంగోపాల్ను పార్టీ పదవి నుంచి తొలగించడంతో పాటు ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ ప్రకటించారు. ములాయంకు శివపాల్ సొంత తమ్ముడు కాగా, రాంగోపాల్ వరుసకు సోదరుడు అవుతారు.
అఖిలేష్ను రాంగోపాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని శివపాల్ అన్నారు. రాంగోపాల్ తనపై కుట్రపన్నారని, ఆయన కొడుకును రక్షించుకోవడానికి బీజేపీతో చేతులు కలిపాడని ఆరోపించారు. అంతకుముందు అఖిలేష్కు మద్దతుగా రాంగోపాల్ ఎస్పీ చీఫ్ ములాయంకు లేఖ రాశారు.