దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు
దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లింలు తమ ఉపవాస దీక్షలను విరమించి పండగ చేసుకుంటున్నారు. ఇఫ్తార్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రంజాన్ పండుగ, శుక్రవారం కలిసి రావడంతో ముస్లింలు మరింత ఆనందంగా ఉన్నారు. లక్షలాది మంది ముస్లింలు సంప్రదాయ దుస్తులు ధరించి తమకు సమీపంలో ఉన్న మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మక్కామసీద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెలరోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసదీక్షలు నిర్వహించిన ముస్లిం సోదరులు.. దీక్షలకు పరిపూర్ణ ఫలితం లభించే రంజాన్ పండుగ రోజున సంబరాలు జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆలింగనాలు, కరచాలనాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
ముంబైలోని దహీసర్, బొరివ్లి, జోగేశ్వరి, అంధేరి, మారోల్, బాంద్రా, సియాన్, బైకుల్లా, మాజాగావ్, ఘట్కోపర్, ఇతర ప్రాంతాలు ప్రత్యేకప్రార్థనల సందర్భంగా జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పవిత్ర సందేశాన్ని అందించారు. గడిచిన రెండు దశాబ్దాల్లో తొలిసారిగా చారిత్రక ఆజాద్ మైదాన్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరగలేదు.
భారీ వర్షం కురుస్తుండటం వల్ల బహిరంగ ప్రదేశం కావడంతో ఇక్కడ ప్రార్థనలు నిర్వహించలేదని నాగ్పాడలో నివసించే సయ్యద్ జాఫర్ తెలిపారు. మహారాష్ట్రలోని థానె, రాయగఢ్, రత్నగిరి, పుణె, నాసిక్, ఔరంగాబాద్, బీద్, నాందేడ్, ఇతర జిల్లాల్లో కూడా రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి.