బడ్జెట్ తర్వాతే రేట్ల కోత?
బేస్ రేటు తగ్గింపు వాయిదా
లాభదాయకతపైనే బ్యాంకుల దృష్టి
షేరు ధర పెంచుకోవటం; నిధులు సేకరించటానికే ప్రాధాన్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు ఈఎంఐ భారం తగ్గడానికి కొన్నాళ్లు ఎదురు చూడక తప్పదు. జనవరిలో ఆర్‌బీఐ పావు శాతం వడ్డీరేట్లు తగ్గించినా... మెజార్టీ బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని పాత రుణ ఖాతాదారులకు వర్తింప చేయలేదు. మంగళవారం ఆర్‌బీఐ పరపతి సమీక్షలో వడ్డీరేట్లు కోత ఏమైనా ఉంటే కొంత ప్రయోజనాన్ని అందించడానికి బ్యాంకులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కానీ రేట్ల కోత బడ్జెట్‌పై ఆధారపడివుంటుందని ఆర్‌బీఐ చెప్పడంతో బ్యాంకులు కూడా బేస్ రేటు తగ్గింపును వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే తమ బేస్ రేటు చాలా తక్కువ స్థాయిలో ఉందని, డిపాజిట్ల రేట్లు తగ్గించకుండా రుణాలపై రేట్లను తగ్గించలేమని ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్.రాజేంద్రన్ స్పష్టం చేశారు.
ముందుగా డిపాజిట్ల రేట్లను తగ్గిస్తే కానీ.. రుణాలపై వడ్డీరేట్లు తగ్గించలేమని, మార్చిలోగా బేస్‌రేటు తగ్గిస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డెరైక్టర్ శంతను ముఖర్జీ చెప్పారు. కొత్తగా రుణాలు తీసుకునే వారికి తక్కువ రేటుకే రుణాలిస్తున్నప్పటికీ.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి మాత్రం బేస్ రేటు తగ్గితే తప్ప వడ్డీ భారం తగ్గదు. బడ్జెట్ తర్వాత ఆర్‌బీఐ మరో పావు శాతం తగ్గించినా, ఇప్పటికే తగ్గించిన పావు శాతంతో కలిపి మొత్తం అర శాతం తగ్గించే అవకాశం లేదంటున్నారు. పెరిగిన ఎన్‌పీఏలతో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై తీవ్ర ఒత్తిడి ఉండటంతో బ్యాంకు యాజమాన్యాలు వడ్డీరేట్లను తగ్గించడానికి వెనుకంజ వేస్తున్నాయి. జనవరి 15న ఆర్‌బీఐ పావు శాతం తగ్గించాక యూనియన్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ సహా మూడు బ్యాంకులే బేస్ రేటును కొద్దిగా తగ్గించాయి. వడ్డీరేట్ల తగ్గింపుపై బ్యాంకు యాజమాన్యాలు, బోర్డులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, దీంట్లో తాము కలుగ చేసుకోబోమని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు.
లాభాలపైనే దృష్టి: వచ్చే ఆర్థిక సంవత్సరం రుణాలకు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. అందుకని వ్యాపార విస్తరణకు కావాల్సిన నిధులపై దృష్టిసారిస్తున్నాయి. ప్రభుత్వ వాటాను 52 శాతానికి తగ్గించుకోవడానికి అనుమతిచ్చినప్పటికీ... షేరు ధరలు ప్రస్తుతం తక్కువగా వుండటంతో నిధుల సేకరణ సాధ్యం కావడం లేదు. చాలా ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు వాటి పుస్తక విలువ కంటే తక్కువ ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు బ్యాంకులు లాభాలను పెంచుకొని షేర్ల ధరలను పరుగులు పెట్టించే పనిలో పడ్డాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అధిక వడ్డీరేటు ఉన్న డిపాజిట్లను వదిలించుకోవడమే కాకుండా, తక్కువ వడ్డీరేటుకు ఇచ్చే రుణాలకు దూరంగా ఉంటున్నాయి. పెద్ద కార్పొరేట్లకు తక్కువ వడ్డీరేటుకే రుణాలు తీసుకునే శక్తి ఉంటుందని, అందుకే గత రెండేళ్లుగా కార్పొరేట్ రుణాలను తగ్గించుకుంటూ ఎక్కువ వడ్డీరేటు ఉండే రిటైల్, ఎస్‌ఎంఈ రంగాల కేసి దృష్టి సారిస్తున్నామని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.ఆత్మారామ్ చెప్పారు. రెండేళ్ళ క్రితం మొత్తం రుణాల్లో 70 శాతం కార్పొరేట్ రుణాలు ఉంటే వచ్చే ఏడాది నాటికి దీన్ని 55 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్‌లు కూడా అధిక వడ్డీరేటున్న బల్క్ డిపాజిట్లును వదలించుకోవడమే కాకుండా, రిటైల్ రుణాలపై దృష్టిసారిస్తున్నాయి. తక్కువ వడ్డీరేటు ఉండే కాసా డిపాజిట్లను పెంచుకోవడం.. చౌకగా విదేశీ బాండ్ల ద్వారా నిధులు సేకరించటం... వచ్చే రెండేళ్ళలో ఆంధ్రాబ్యాంక్‌ను ఒక క్వార్టర్లో వెయ్యి కోట్ల లాభాలను ప్రకటించే స్థాయికి చేర్చటం లక్ష్యాలని రాజేంద్రన్ చెప్పారు.
బాసెల్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వరంగ బ్యాంకులకు 2018 నాటికి అదనంగా రూ.2.5 లక్షల కోట్లు అవసరమవుతాయి. దీనికోసం వాటాలను విక్రయించుకోక తప్పదు. షేర్ల ధరలు బాగా పెరిగితేనే ఇది సాధ్యం. అందుకే బ్యాంకులు వ్యాపారం కంటే బ్యాలెన్స్ షీట్ సరిదిద్దుకోవటానికే ప్రాధాన్యమిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఫాలో ఆన్ లేదా ఇతర ఇష్యూల ద్వారా నిధులు సేకరించడానికి ఎస్‌బీఐ, బీవోఎం, విజయా, సిండికేట్, ఆంధ్రాబ్యాంక్‌లు ప్రణాళికలు వేస్తున్నాయి.