
ఆర్‌బీఐ కీలక నిర్ణయం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరవ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లకు ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది.. ఫిబ్రవరి 8 బుధవారం ఆర్బీఐ నిర్వహించిన క్రెడిట్ పాలసీ రివ్యూలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు తెలిపింది. రెపో(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను 6.25శాతంగా, రివర్స్ రెపో రేటు(ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు)ను 5.75 శాతంగా ఉంచుతున్నట్టు పేర్కొంది. బ్యాంకు రేటు 6.75 శాతంగా అమలుకానుంది.
ఆర్‌బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరుగుతున్న మూడవ సమీక్ష ఇది. మెజారిటీ ప్రాతిపదికన రేట్ల నిర్ణయం తీసుకోడానికి ఆరుగురు సభ్యులతో పరపతి విధాన కమిటీ (ఎంసీపీ) ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న 3వ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కాగా వడ్డీ రేట్ల తగ్గింపుపై అనేక సెక్టార్లు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వారి ఆశలు అడియాసలు చేస్తూ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ కమిటీ ఈ నిర్ణయం వెలువరచగానే, మార్కెట్లో నష్టాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంలో 28,220 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 8,739వద్ద కొనసాగుతున్నాయి.