రెజ్లర్ మహవీర్‌సింగ్ ఫోగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'దంగల్' సినిమాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఇటు ప్రశంసలు, అటు కలెక్షన్లతో దూసుకుపోతుండగా.. తాజాగా ఈ చితానికి అనుకోని షాక్ ఎదురైంది. ఈ సినిమాలో తన పాత్రను చూపించిన తీరుపై గీత, బబిత ఫోగట్‌ల నిజజీవిత కోచ్ పీఆర్ సోంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మహవీర్‌సింగ్ తన కూతుళ్లు గీత, బబితలను రెజ్లర్లుగా తీర్చిదిద్దిన తీరు ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో గీత, బబితల కోచ్‌గా పీఆర్ కదం పాత్రను నెగిటివ్ ఇమేజ్‌తో రూపొందించడంపై పీఆర్ సోంధీ మండిపడుతున్నారు. 70 ఏళ్ల సోంధి 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో గీతకు, బబితకు జాతీయకోచ్‌గా వ్యవహరించాడు. అయితే, సినిమాలో కామన్‌వెల్త్‌లో గీత ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మహవీర్‌ను ఒక గదిలో బంధించి ఆమె మ్యాచ్ చూడకుండా కోచ్ కుట్రపన్నినట్టు చూపించే సీన్ ఉంది. ఈ సీన్ గురించి తెలిసి తాను నివ్వెరపోయినట్టు కోచ్ సోంధి చెప్పారు.
'మహవీర్‌జీ నాకు ఒకప్పటి మిత్రుడే. ఫోగట్ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను సినిమా చూడలేదు కానీ, నా పాత్ర ఆధారంగా తీసిన కొన్ని సీన్ల గురించి నా శిష్యులు చెప్పడంతో నేను నివ్వెరబోయాను. సినిమాలో మసాలా జోడించడానికి ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం సరికాదు. నా పేరును నేరుగా ఉపయోగించకపోయినా.. నన్ను ఉద్దేశించే ఆ పాత్రను తీర్చిదిద్దారు. కామన్‌వెల్త్ క్రీడల సందర్భంగా జాతీయ కోచ్ ఒకరిని గదిలో బంధించి ఉంటే దాని గురించి మీడియాకు, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. దీని గురించి అడిగితే.. గీత కూడా ఈ ఆరోపణలను ఖండిస్తుంది' అని సోంధీ పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్మాతపై లీగల్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నానని, మొదట భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌శరణ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు.