33 వేల మారుతీ కార్ల రీకాల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఆల్టో 800, ఆల్టో కే10 మోడల్‌లో 33,098 కార్లను రీకాల్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 8, ఈ ఏడాది ఫిబ్రవరి 18 మధ్య తయారైన కార్లలో కుడి వైపు డోర్ గడియకు సంబంధించి ఉన్న చిన్న లోపాన్ని సవరించడానికి ఈ రీకాల్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. 19,780 ఆల్టో 800 కార్లను, 13,318 ఆల్టో కే10 కార్లను రీకాల్ చేసి, ఈ లోపాన్ని ఉచితంగా సరిచేసి ఇస్తామని తెలియజేసింది. ఈ కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్లు సమాచారమందిస్తారని తెలిపింది. డీలర్ వర్క్‌షాప్‌లో టెక్నీషియన్స్ ఈ లోపాలను ఉచితంగా సరిచేస్తారని పేర్కొంది.