దేని దారి దానిదే...రన్నింగ్‌లోనే రీచార్జ్‌ | Recharge in running | Sakshi
Sakshi News home page

దేని దారి దానిదే...రన్నింగ్‌లోనే రీచార్జ్‌

Published Tue, Jun 6 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

దేని దారి దానిదే...రన్నింగ్‌లోనే రీచార్జ్‌

దేని దారి దానిదే...రన్నింగ్‌లోనే రీచార్జ్‌

ఇంకొన్నేళ్లలో... కచ్చితంగా చెప్పాలంటే 13 సంవత్సరాల్లో భారత్‌తో 90 శాతం వాహనాలు విద్యుత్తుతోనే నడుస్తాయి. కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. బాగానే ఉందిగానీ.. ఎలక్ట్రిక్‌ వాహనాలతో వచ్చే ఇబ్బందుల మాటేమిటి? వందల కిలోమీటర్ల దూరం వెళ్లాంటే? మార్గమధ్యంలో బ్యాటరీ ఖాళీ అయిపోతే? ఏం ఫర్యాలేదు అంటోంది క్వాల్‌కామ్‌. మీరు రోడ్డుపై మీ విద్యుత్తు వాహనంతో అలా అలా దూసుకెళుతూ ఉండండి.. మేము మా టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అక్కడికక్కడే బ్యాటరీలు ఛార్జ్‌ చేసేస్తూ ఉంటాం అంటోంది.

 కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్లను వైర్‌లెస్‌ పద్ధతిలో ఛార్జ్‌ చేసుకుంటున్నాం చూడండి అలాగన్నమాట! మొబైల్‌ఫోన్ల మైక్రోప్రాసెసర్లు తయారు చేసే ఈ కంపెనీ కొన్నేళ్లుగా విద్యుత్తు వాహనాలను సులువుగా ఛార్జ్‌ చేయడం ఎలా అన్నదానిపై కూడా పరిశోధనలు చేస్తోంది. హాలో పేరుతో ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించింది. మన ఇళ్లల్లో వాడే ఇండక్షన్‌ స్టౌ గురించి మీకు తెలిసే ఉంటుంది. అచ్చం దీని మాదిరిగానే హాలో కూడా అయస్కాంతాలను ఉపయోగించుకుని విద్యుత్తును వైర్‌లెస్‌ పద్ధతిలో సరఫరా చేస్తుందన్నమాట. రోడ్డు వెంబడి ఇండక్షన్‌ పొయ్యి లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం.. వీటి ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తును గ్రహించేందుకు అవసరమైన ఏర్పాట్లు వాహనాల అడుగున చేసుకోవడం ద్వారా హాలో పనిచేస్తుంది.

రోడ్డుపై వాహనం వెళుతున్నప్పుడు ఒక్కో పరికరం కొంత చొప్పున విద్యుత్తు అందిస్తూంటుందన్నమాట. అంతేకాదు.. పార్కింగ్‌ స్థలాల్లోనూ హాలో పరికరాలు ఏర్పాటు చేసుకుంటే.. ప్రత్యేకంగా ప్లగ్‌ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాటరీలను ఛార్జ్‌ చేయవచ్చు. ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా ఏ కారుకు ఎంత మేరకు విద్యుత్తు అవసరమో గుర్తించి అంతే సరఫరా అయ్యేలా చేయవచ్చు కూడా.  కారు సైజును బట్టి 3.3 కిలోవాట్‌/గంటల నుంచి 20 కిలోవాట్‌/గంటల విద్యుత్తును సరఫరా చేయగలమని... ఈ టెక్నాలజీ వచ్చే ఏడాది నుంచే అందుబాటులోకి రానుందని క్వాల్‌కామ్‌ అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement