
ఓటుందో లేదో చూస్కోండి: భన్వర్‌లాల్
గుర్తింపు కార్డున్నా.. జాబితాలో పేరు లేకుంటే ఓటేయలేరు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టీకరణ
ఓటర్ల నమోదు ప్రక్రియ గడువు 17 వరకు పెంపు
8, 15 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు
రాజకీయ పార్టీల ఏజెంట్లు, పౌరులు వెళ్లి పేర్లు నమోదు చేయించుకోవచ్చు
జనవరి 1కి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటర్‌గా పేరు నమోదు చేసుకోండి
దురుద్దేశంతో జాబితా నుంచి ఓటర్ల పేర్లు తొలగిస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలకు ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ గడువును ఈ నెల 10వ తేదీ నుంచి 17 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నేపథ్యంలో ఆయన బుధవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చా రు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని, ఒక వేళ జాబితాలో పేరు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ గడువు పొడిగించినందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 17 లోగా దరఖాస్తు చేసుకున్న వారందరి పేర్లు జనవరి 25 నాటికి ఓటర్ల జాబితాల్లో ఉంటాయని, వారికి గుర్తింపు కార్డులు కూడా జారీ అవుతాయని ఆయన వెల్లడించారు. కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లు తొలగించినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, కావాలని దురుద్దేశపూర్వకంగా ఎవరైనా ఓటర్ల పేర్లను తొలగిస్తే వారిపై చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోతే ఓటు వేయలేరని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 70 వేల పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 8, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉంటారని చెప్పారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు లేదా పౌరులు అక్కడికి వెళ్లి జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చూసుకోవాలని, పేర్లు లేకపోతే అక్కడికక్కడే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ కల్లా 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులందరూ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేయించుకునేందుకు కాలేజీల సహకారం తీసుకుంటున్నామన్నారు.
ప్రతి కాలేజీలో క్యాంపస్ అంబాసిడర్‌గా చురుకైన విద్యార్థిని నియమించి, ఆ కాలేజీల్లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరి చేత ఓటర్‌గా నమోదు చేయించే బాధ్యతను ఆ అంబాసిడర్‌కు అప్పగిస్తామని తెలిపారు. ఇందుకోసం ఆ విద్యార్థికి రూ.2వేల గౌరవ వేతనం కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇ-రిజిస్ట్రేషన్ ద్వారా కూడా ఓటర్‌గా నమోదు చేసుకోవచ్చునని, ప్రస్తుతం 60 శాతం దరఖాస్తులు ఇ-రిజస్ట్రేషన్ ద్వారానే వస్తున్నాయని వివరించారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఓటర్‌గా నమోదు చేసుకునే అవకాశాన్ని శనివారం నుంచి కల్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 17 తర్వాత కూడా ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, అయితే వాటిని ఫిబ్రవరి లేదా మార్చిలోగా అధికారులు పరిష్కరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ లోగా ఎన్నికలు వస్తే ఓటు వేయడానికి అవకాశం ఉండదని, అందువల్ల జాబితాల్లో పేర్లు లేని అర్హులందరూ ఈ నెల 17లోగా ఓటర్‌గా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
13, 14 తేదీల్లో కలెక్టర్లతో భేటీ : వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం ప్రారంభించినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 13, 14 తేదీల్లో జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సౌకర్యాలపై చర్చించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అలాగే ఓటర్ల నమోదు ప్రక్రియ సాగుతున్న తీరును కూడా సమీక్షించనున్నట్లు చెప్పారు.