జియో తరువాతి డాటా ప్లాన్ ఏంటి?
న్యూడిల్లీ: రిలయన్స్ జియో సంచలన ఆఫర్ ముగిసిన తరువాత డాటా చార్జ్ ఎంత వసూలు చేయనుందనే దానిపై ఊహాగానాలు భారీగానే నెలకొన్నాయి. ప్రస్తుత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తరువాత డాటా ప్లాన్ రూ.100గా ఉండనుందని వార్తలు వెలువడుతున్నాయి. టెలికాం దిగ్గజాలకు షాకిస్తూ ఆఫర్లను అందిస్తున్న జియో ఫ్రీ ఆఫర్ ముగిసిన తరువాత డేటా వినియోగానికి రూ.100 వసూలు చేయవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
అపరిమిత కాలింగ్, ఉచిత డ్యాటా అంటూ భారతీయ టెలికాం రంగంలోకి రియలన్స్ జియో ఇన్ఫోకాం దూసుకువ చ్చింది. గత డిసెంబర్‌తో ముగిసిన ఈ ఆఫర్ ను హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ గా మార్చి 31, 2017 వరకు పొడిగించింది. మార్చి తరువాత ఉచిత డాటా ప్లాన్ రూ.100 గా నిర్ణయించనుందట. మరోవైపు ఈ ఫ్రీ ఆఫర్ ను జూన్ 30వరకు పొడిగించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
కాగా ఆవిష్కరించిన మూడు నెలల్లో ఫేసు బుక్ , వాట్సాప్, స్కైప్ లాంటి సామాజిక నెట్వర్కింగ్ సైట్లకు ధీటుగా యూజర్లను సొంతం చేసుకుంది జియో. 72 మిలియన్లకు పై చందాదారులను ఆకర్షించిందని ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత డిసెంబర్ లో ప్రకటించారు. అంతేకాదు 100 మిలియన్ల లక్ష్యంగా ముందుకుపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సుమారు రూ .2 లక్షల కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఎంట్రీ ఇచ్చిన జియో ఇతర టెల్కోలను తారిఫ్‌వార్ లో అనివార్యంగా లాక్కొచ్చింది. మరి ఈ రూ. 100 ల డాటా ప్లాన్ ఇతర కంపెనీలను ఇరకాటంలో పెట్టనుందా.. వేచి చూడాలి.