- సొంత పార్టీలో తీవ్రమవుతున్న వ్యతిరేకత
- అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలంటున్న రిపబ్లికన్ నేతలు
మరో నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మహిళల పట్ల అత్యంత కిరాతకంగా లైంగిక వ్యాఖ్యలు చేసిన వీడియో వెల్లడి కావడం ఆ పార్టీని కుదిపేస్తోంది. ఈ వీడియో నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు మూకుమ్మడిగా గళమెత్తుతున్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్న రిపబ్లికన్ పార్టీ నేతల జాబితా నానాటికీ పెరిగిపోతుండటంతో.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచే మాట అటుంచితే.. అసలు అమెరికా కాంగ్రెస్ ఉభయ చట్టసభల్లోనూ పార్టీకి ప్రాతినిధ్యం ఉండదేమోనన్న సందేహాలు అమెరికాలో అత్యంత పురాతన పార్టీ (గ్రాండ్ ఓల్డ్ పార్టీ-జీవోపీ)లో వినిపిస్తున్నాయి.
మహిళల పట్ల అత్యంత దుర్భాషపూరితమైన లైంగిక వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ వీడియోను వాషింగ్టన్ పోస్టు విడుదల చేయడంతో ఒక్కసారిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సమీకరణాలు మారిపోయాయి. అత్యంత కీలకమైన సెయింట్ లూయిస్ అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ (చర్చ) సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోతో ఎన్నికల రేసులో దూసుకుపోతున్న ట్రంప్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాను మూర్ఖమైన మాటలు మాట్లాడానని, తనను క్షమించాలని ట్రంప్ వేడుకున్నా.. ఆ వీడియో సెగలు మాత్రం చల్లారడం లేదు. అమెరికాలోని అన్ని వర్గాల వారు, ముఖ్యంగా మహిళలు ఈ వీడియోలోని దుర్భాషలపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో సెయింట్ లూయిస్ డిబేట్‌తో ట్రంప్ వ్యతిరేక సెగలు మరింతగా చెలరేగవచ్చునని భావిస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలతో బిత్తరపోయిన సొంత పార్టీ రిపబ్లికన్ నేతలు దాదాపు డజనుకుపైగా మంది.. ఆయన అధ్యక్ష ఎన్నికల నుంచి పార్టీ అభ్యర్థిగా తప్పుకోవాల్సిందేనని బాహాటంగా డిమాండ్ చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన రిపబ్లికన్ నేతల్లో సెనేటర్ జాన్‌కెయిన్, 2008నాటి పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఆర్ ఆరోజోనా తదితర కీలక నాయకులు ఉన్నారు. పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించినప్పటికీ.. ఆయన రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌కు మద్దతు పలుకలేదు. విస్కాన్సిన్ హౌస్ స్పీకర్ పాల్ రియాన్, సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్‌కొన్నెల్, పార్టీ చైర్మన్ రీన్స్ ప్రీబస్ మాత్రం ట్రంప్‌కు అండగా నిలబడ్డారు. మరోవైపు ట్రంప్ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అధ్యక్ష బరినుంచి తప్పుకొనేది లేదని ఆయన స్పష్టం చేశారు.