
సుప్రీంకు విన్నవించిన అంశాలపై ‘మీడియా’లో చర్చ సరికాదు: సహారా
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతోరాయ్ విడుదల బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణ అంశాలపై సుప్రీంకోర్టు ముందు పేర్కొన్న అంశాలపై బహిరంగ చర్చ, మీడియా ఊహాగానాలు సరికాదని సహారా పేర్కొంది. ఆయా అంశాలు పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొంది. సహారా నిధుల సమీకరణపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. నిధుల సమీకరణకు సుప్రీంకోర్టుకు తాజాగా సంస్థ ఒక ప్రతిపాదనను తెలియజేసింది. చైనా బ్యాంక్ నుంచి సహారా ఆస్తుల తనఖా విడుదలకు స్పెయిన్ బ్యాంక్ బీబీవీఏ రుణం అందించనుందన్నది దీని సారాంశం.
అయితే తమ వద్ద ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బీబీవీఏ పేర్కొన్నట్లు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఇక హెచ్‌ఎస్‌బీసీ రూ.5,000 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుందని సహారా పేర్కొంటున్నప్పటికీ, ఆ బ్యాంకు నుంచి సైతం ఈ మేరకు ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. హెచ్‌ఎస్‌బీసీ ప్రతినిధి అసలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయడానికి నిరాకరించగా, పేరు తెలపడానికి ఇష్టపడని మరో అధికారి అసలు ఇటువంటి ప్రతిపాదనే తమ వద్ద లేదని పేర్కొన్నారు. విదేశాల్లోని ఆస్తుల అమ్మకం, బెయిల్‌కు నిధుల సమీకరణకు సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది.