
సమ్మె విరమించిన వైద్యులు
ముంబై: మహారాష్ట్రలో ఆందోళనకు దిగిన ప్రభుత్వ వైద్యులు శుక్రవారం అర్ధరాత్రి సమ్మె విరమించి విధుల్లో చేరారు. తమ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చిందని అందుకే తిరిగి విధుల్లోకి చేరామని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. 'వైద్యులపై దాడులు అరికడతామని సీఎం, ముంబై హైకోర్టు ఇచ్చిన హామీని విశ్వసిస్తున్నాం. డాక్టర్ల దాడులు చేసిన వారిని భవిష్యత్తులో కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాం' అని డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
ముంబైలో విధుల్లో ఉన్న వైద్యుల దాడి ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు సోమవారం నుంచి ముకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకొని రోగుల కష్టాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే విధుల్లోకి చేరాలని వైద్యులను ఆదేశించింది. డాక్టర్లకు తగిన భద్రత కల్పించేందుకు ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని సూచించింది. వైద్యులు నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తమకు తగిన భద్రత కల్పిస్తే పనిచేసేందుకు సిద్ధమని మహారాష్ట్ర రెసిడెంట్ వైద్యుల సంఘం(ఎంఏఆర్డీ) కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇవ్వడంతో వైద్యులు సమ్మె విరమించారు.