
శ్రీనగర్ లో ఉద్రిక్తత, ఆంక్షల విధింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో భద్రతా దళాలతో జరిగిన ఘర్షణలో యువకుడొకరు మృతి చెందడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో శ్రీనగర్ లో ఆంక్షలు విధించారు. శ్రీనగర్ లోని జైనకోటా ప్రాంతంలో రాళ్లు రువ్విన అల్లరిమూకలపై భద్రత బలగాలు దాడి చేశాయి. ఈ ఘటనలో గౌహర్ అహ్మద్ దార్(18) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.
దీనిపై పోలీసులు విచారం వ్యక్తం చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ ఫరూఖ్ అహ్మద్ లోన్ దర్యాప్తుకు ఆదేశించారు. వేర్పాటువాద నాయకులు కశ్మీర్ లోయలో బంద్ కు పిలుపునివ్వడంతో శ్రీనగర్ లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆంక్షలు విధించారు. వేర్పాటువాద నాయకుల గృహనిర్భందం కొనసాగించారు. స్టేట్ సర్వీసు సెలక్షన్ బోర్డు నేడు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.