రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జంతర్ మంతర్ వద్ద ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ ర్యాంకు వన్ పెన్షన్ విధానం ఆలస్యం కావడంపై తమ గోడును వెల్లబుచ్చుకోవడానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్తో భేటీ కావడం కుదరకపోవడంతో మనస్తాపం చెందిన సుబేదార్ రామ్ కిషన్ గ్రెవాల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మనోహర్ పారికర్ను కలిసేందుకు ఎలాంటి అభ్యర్థనను తాము రక్షకుడిని నుంచి స్వీకరించలేదని మంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్మీ ఉద్యోగి వన్ ర్యాంకు వన్ పెన్షన్లో మార్పులు డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కూడా పాలుపంచుకున్నారు.
పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి, ఆత్మహత్యకు గల కారణాలను తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. వన్ ర్యాంకు వన్ పెన్షన్ డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవ్వడంతోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని సుబేదార్ గ్రెవాల్ కుమారుడు రామ్ క్రిష్ణ గ్రెవాల్ తెలిపారు. దేశం కోసం ఎంతో కష్టపడిన మాజీ సైనికోద్యోగులందరికీ తక్షణమే వన్ ర్యాంకు-వన్ పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని జంతర్ మంతర్ వద్ద వారు గతేడాది నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. 80 రోజుల మాజీ సైనికోద్యోగుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం, ఆ పథకాన్ని అమలుచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే తమ నాలుగు ప్రాథమిక పరిస్థితులను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్టు మాజీ సైనికోద్యోగులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలుచేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంందని వారు ఆరోపిస్తున్నారు.