దేశరక్షకులకు ఏయూ బాసట
దేశరక్షణ కోసం చిన్నతనంలోనే పనిచేసే సైనికులు.. ఉద్యోగ విరమణ తరువాత ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తూ.. విద్యార్హతల విషయంలో భంగపడేవారు. సైనికుల సమస్యలకు పరిష్కారం చూపుతూ త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు ఉన్నత విద్యను చేరువచేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా సైనికోద్యోగులకు ఉన్నత విద్య అవకాశాలను, నైపుణ్యం కలిగిన కోర్సులను అందించింది. సైనికులకు మరిన్ని సేవలందించేందుకు సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా మార్చింది. -సాక్షి, విశాఖపట్నం
దేశరక్షణ కోసం అహర్నిశలు సరిహద్దుల్లో పోరాడుతున్న ఉద్యోగులకు, మాజీ సైనికులకు అవసరమైన విద్యాసంబంధ కోర్సులను అందించాలని ఏయూ సంకల్పించింది. దీన్ని ఆచరణలో పెట్టే దిశగా 2017లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఇండియన్ నేవీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంట్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఏయూతో ఒప్పందాలు చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు. ఇంటర్ విద్యార్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి డిప్లొమా కోర్సులను అందించడం ప్రారంభించారు. అలా ఒక డిప్లొమా కోర్సుతో మొదలుపెట్టిన ఏయూ అధికారులు ఇప్పుడు 26 డిప్లొమా కోర్సుల్ని అందిస్తున్నారు.
కెమికల్, ఎలక్ట్రికల్, అకౌంటింగ్–మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజె¯న్స్ సర్విస్, టీచింగ్ అండ్ ఎడ్యుకేష¯న్ సర్వీసెస్, హౌస్‌కీపింగ్, మ్యూజిక్, ఎయిర్‌ఫీల్ట్ సేఫ్టీ, అకౌంటింగ్ అండ్ ఆడిట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ మేనేజ్మెంట్, ఎయిర్‌సేఫ్టీ, మెటరలాజికల్ అసిస్టెŒన్స్ తదితర కోర్సులు అందిస్తున్నారు. సైనికులకు విద్యనందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా ప్రత్యేక కేంద్రంగా మార్చి సేవలను విస్తరించారు.
బీఎస్సీ డిగ్రీలు, పీహెచ్‌డీలు
ఐఎన్ఎస్ విశ్వకర్మలో పనిచేస్తున్న సిబ్బందికి డిగ్రీలు అందించే దిశగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారికోసం ప్రత్యేకంగా నూతన ఉపాధి అవకాశాల కల్పన గురించి ఆలోచించిన ఏయూ.. పలు ప్రీ రిలీజ్ కోర్సులను ప్రారంభించింది. ఏడాదికి 15 బ్యాచ్‌ల వరకు ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 నుంచి 50 మంది వరకు సైనికోద్యోగులు పాల్గొంటున్నారు.
వీటికి ప్రత్యేకమైన సిలబస్ రూపొందించి ఏయూ అకడమిక్ సెనేట్‌లో ఆమోదించారు. ఇప్పటివరకు 58 బ్యాచ్‌లను నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 2,900 మందికిపైగా సైనికోద్యోగులకు ధ్రువపత్రాల్ని అందించింది. ఎగ్జిక్యూటివ్ కేటరిగీలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అధికారులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 38 మంది అధికారులు పీహెచ్డీ చేశారు.
కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్తో జత
హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ వార్ఫేర్ కాలేజీతో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ కోర్సుల్ని అందిస్తోంది. గ్రూప్ కెపె్టన్, వింగ్ కమాండర్ స్థాయి వారికి ఈ కోర్సును అందిస్తున్నారు.
ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని జూనియర్ ఆఫీసర్ ట్రైనీగా పనిచేస్తున్న వారికి పీజీ డిప్లొమాని డిజైన్ చేసి అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ అధికారులకోసం బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దాదాపు ఆరువేలమంది సైనికులు ఈ ఎంవోయూ ఫలితంగా బీఏ డిగ్రీలను పొంది బ్యాంకులు తదితర రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు.
దేశరక్షణకు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న సైనికులకు ఏయూ వందనం చేస్తోంది. వారి సేవల్ని గుర్తించి.. సైనికుల జీవితాల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతవిద్య అందిస్తోంది. గత వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి చొరవతో ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కోర్సుల్లో సైనికోద్యోగులకు, సైనిక వీరులకు ప్రవేశాలు కల్పిల్పిస్తున్నాం.
నేవీ సిబ్బంది ఎంటెక్ చదివే అవకాశం ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన సైనికోద్యోగులకు బీపీఈడీ కోర్సు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఇండియన్ కోస్ట్‌గార్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తోను ఎంవోయూ కుదుర్చుకున్నాం. – ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్, ఏయూ రిజిస్ట్రార్