
వక్రబుద్ధితో యాగాలు చేస్తే ఫలితం ఉండదు
అయుత చండీయాగం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌పై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అయుత చండీయాగం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌పై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పవిత్ర మనసుతో దేవుడికి దండం పెట్టుకున్నా చాలని... వక్రబుద్ధితో యాగాలు చేస్తే ఫలితం ఉండదన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బలం లేకున్నా అభ్యర్థులను పోటీలో నిలిపిందన్నారు.
ఫిరాయింపుదారులు, పెట్టుబడిదారులనే నమ్ముకున్న సీఎం కేసీఆర్ దొడ్డిదారిన ఎమ్మెల్సీలను గెలుచుకోవాలని భావిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ బరితెగించి స్థానిక సంస్థల ప్రతినిధులను కొనుగోలు చేసి రాజకీయం చేస్తోందని... ఇప్పటికే అధికార దుర్వినియోగానికి పాల్పడి 6 స్థానాలను ఏకగ్రీవం చేసుకుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేసీఆర్‌ను కోరడమంటే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేనన్నారు.