
ఎన్‌కౌంటర్‌పై విచారణ
* శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించండి
* చంద్రబాబు సర్కారుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం
* ఏపీ సీఎస్, డీజీపీలకు కమిషన్ ప్రత్యేక ఆదేశాలు
* సీఆర్‌పీసీలోని 176(1)(ఎ) ప్రకారం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌చే ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరపాలి.
* ఘటన సమయంలో విధుల్లో ఉన్న అటవీ అధికారులు, పోలీసు అధికారుల వివరాలను ఈ నెల 22లోపు ఎన్‌హెచ్‌ఆర్సీకి సమర్పించాలి.
* మృతదేహాలకు శవపరీక్షను ఎన్‌హెచ్‌ఆర్సీ-2010 నాటి మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలి.
* ఎస్టీఎఫ్, బాధితులు ఉపయోగించిన ఆయుధాలను కస్టడీలో ఉంచాలి.
శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్ ఘటనపై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సోమవారం విన్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. చంద్రబాబు సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఘటనపై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల వివరాలను ఆమూలాగ్రం నమోదు చేసి ఈ నెల 22లోగా అందించాలని ఆదేశించింది. పోలీసు రిజిస్టర్లు, లాగ్ పుస్తకాలను భద్రపరచాలని పేర్కొంది. వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు, వారి బంధువులకు, పంచాయతీ పెద్దలకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది.
సాక్షి, న్యూఢిల్లీ: శేషాచలం ఎన్‌కౌంటర్ ఘటనపై చంద్రబాబు సర్కారుకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనపై ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం విన్న అనంతరం కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల వివరాలను ఆమూలాగ్రం నమోదు చేసి ఈ నెల 22లోగా తమకు అందించాలని నిర్దేశిం చింది. పోలీసు రిజిస్టర్లు, లాగ్ పుస్తకాలను పూర్తిగా భద్రపరచాలని పేర్కొంది. అలాగే.. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వాంగ్మూలం ఇచ్చిన సాక్షులకు, వారి బంధువులకు, ఆయా గ్రామాల పంచాయతీ పెద్దలకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట పోలీసు భద్రతను కల్పించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
వాంగ్మూలం ఇదే: తామంతా బస్సులో ప్రయాణిస్తుండగా.. ఏపీ పోలీసులు అడ్డుకుని తమను శేషాచలం అడవులకు తీసుకెళ్లే యత్నం చేశారని, తాము తప్పించుకున్నా, తమ వాళ్లని తీసుకెళ్లి కాల్చిచంపారని ఎన్‌కౌంటర్ ఘటన నుంచి తప్పించుకున్న తమిళనాడుకు చెందిన శేఖర్(54), బాలచంద్రన్(29)లు ఎన్‌హెచ్‌ఆర్సీ ఎదుట వాంగ్మూలమిచ్చారు. ‘పీపుల్స్‌వాచ్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి హెన్రీ టిఫాగ్నే, సుప్రీం కోర్టు లాయర్ వ్రిందా గ్రోవర్ సహా యంతో వీరు సోమవారం ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఆర్సీకి ఘటన వివరాలను వివరించారు. అనంతరం హెన్రీ ఆ వివరాలను మీడియాకు తెలిపారు.
పక్కన మహిళ ఉండడంతో..
‘శేఖర్ ఒక దినసరి కూలీ. తన బంధువు మహేంద్రన్‌కు చెందిన నిర్మాణ పనుల నిమిత్తం మహేంద్రన్, మూర్తి, మునుస్వామిలతో కలసి ఈ నెల 6న తన గ్రామమైన పూడూరు కొల్లమేడు(తిరువాణ్ణమలై జిల్లా) నుంచి బస్సులో చెన్నైకి బయలుదేరారు. మధ్యాహ్నం 2.30కు ఆర్కాట్ బస్టాండ్ దాటుతుండగా 30 ఏళ్ల వయసు, గుబురు మీసాలు ఉన్న ఓ వ్యక్తి బస్సులోకి ఎక్కి మహేంద్రన్‌ను తనతో రావాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ‘మీరెవరంటూ..’ మహేంద్రన్ ప్రశ్నించడంతో అవతలి వ్యక్తి చొక్కా పట్టుకుని లాక్కుపోయాడు. శేఖర్ అప్పటికే భయానికి గురై వెనక్కి తిరిగి చూస్తే.. తనతో పాటు వచ్చిన మూర్తి, మునుస్వామి కూడా బస్సులో కనిపించలేదు. మరుసటి రోజు రాత్రి 7.30కు పోలీసులు మహేంద్రన్ ఫొటో చూపించి తిరుపతి వద్ద అడవిలో చనిపోయాడన్నారు. చనిపోయిన 20 మందిలో మూర్తి, మునుస్వామి ఉన్నారని తెలిసింది. శేఖర్ పక్కన ఓ మహిళ కూర్చోవడంతో.. శేఖర్ కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తున్నాడని, ఈ బృందంలో సభ్యుడై ఉండడని భావించిన పోలీసులు అతని జోలికి వెళ్లలేదు’
బాలచంద్రన్ ఇలా..: ‘బాలచంద్రన్ ఒక దినసరి కూలీ. ఈ నెల 4న కాంట్రాక్టు ఏజెంట్ పళని ఫోన్ చేసి.. పాండిచ్చేరిలో ఉపాధి ఉందన్నాడు. దీంతో బాలచంద్రన్ తన తండ్రి హరికృష్ణన్ సహా మరో 8 మందిని తీసుకుని ఈ నెల 5న బయలు దేరాడు. మరుసటి రోజు ఉదయం పళనికి సంబంధించిన మరో వ్యక్తి ఈ బృందంతో కలిశాడు. ఆర్కాట్‌కు వెళ్లేందుకు బస్ కోసం ఎదురుచూస్తుండగా బాలచంద్రన్, ఈ కొత్త వ్యక్తి మద్యం సేవించడానికి ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లారు. వీరిద్దరూ తిరిగి బస్టాండ్ చేరేసరికి మిగిలిన బృందం కనిపించలేదు. పళనికి సంబంధించిన వ్యక్తి పళనికి ఫోన్ చేయగా.. నగరి పుత్తూరుకు చేరుకోవాలని పళని సూచించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నగరి పుత్తూరుకు చేరుకునే సమయంలో పళనికి సంబంధించిన వ్యక్తి మరోసారి పళనికి ఫోన్ చేసిన అనంతరం బాలచంద్రన్‌తో.. పళని అరెస్టయ్యాడని చెప్పాడు. కానీ.. పళని ఎందుకు అరెస్టయ్యాడో బాలచంద్రన్‌కు అర్థం కాలేదు. ఆ బృందంలోని తన మరో బంధువు శివకుమార్‌కు ఫోన్ చేయగా.. పరిచయం లేని వ్యక్తి లైన్‌లోకి వచ్చి ‘మీ వాళ్లు తిరుపతిలో ఉన్నారు. త్వరగా వచ్చేయ్’ అని చెప్పారు. బాలచంద్రన్ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న తరుణంలోనే తన తండ్రి, తమ బృందంలోని మరో ఏడుగురు చనిపోయారని తెలిసింది.’
ఇలంగోవన్ అలా తప్పించుకున్నాడు..
ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఇలంగోవన్‌కు ప్రభుత్వ గుర్తింపు కార్డు లేకపోవడంతో ఎన్‌హెచ్‌ఆర్సీకి రాలేకపోయినట్టు హెన్రీ చెప్పా రు. ఇలంగోవన్ కూడా దినసరి కూలీయేనని, తన ఊరికే చెందిన పనీర్ సెల్వం పొరుగూరిలో పనులున్నాయని చెప్పడంతో ఏప్రిల్ 6న బయలుదేరారు. రాత్రి 8 సమయంలో నగరి పుత్తూర్‌లో ఆహారం తినేందుకు దిగగా.. 8 మంది పోలీసులు వీరిని చుట్టుముట్టి లారీలోకి ఎక్కిం చారు. అది తిరుపతి వద్ద రేంజర్స్ ఆఫీస్ వద్ద ఆగడంతో కొందరు పోలీసులు లారీ ఎక్కగా.. కొందరు దిగారు. ఈ సమయంలో ఇలంగోవన్ లారీ నుంచి దూకి తప్పించుకున్నాడు.
స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి
ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపిం చాలని హెన్రీ, గ్రోవర్‌లు డిమాండ్ చేశారు. 14, 15 తేదీల్లో ఒక నిజ నిర్ధారణ కమిటీ ఘటనా ప్రాంతాల్లో పర్యటిస్తుందన్నారు.