ఎన్‌టీపీసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌పై రోడ్‌షోలు
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌టీపీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ప్రభుత్వ వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రక్రియ జోరందుకుంది. ఇందుకోసం ఆయా కంపెనీలు, డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం రోడ్ షోలు చేపట్టాయి. ఎన్‌టీపీసీ విద్యుత్ శాఖ, డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం ఈ నెల 5-10 దాకా సింగపూర్, హాంకాంగ్, లండన్, అమెరికాల్లో ఏకకాలంలో రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, న్యూయార్క్‌లో రోడ్‌షోలు ఉంటాయని వివరించాయి.
ప్రస్తుత షేర్ల ధరల ప్రకారం ఎన్‌టీపీసీలో 5 శాతం వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ. 5,200 కోట్లు, బీఈఎల్‌లో 5 శాతం డిజిన్వెస్ట్‌మెంట్‌తో రూ. 1,400 కోట్లు రాగలవని అంచనా. రోడ్‌షోల్లో ఇన్వెస్టర్ల స్పందన, దేశీ స్టాక్ మార్కెట్లలో పరిస్థితులను బట్టి రెండు సంస్థల్లోనూ డిజిన్వెస్ట్‌మెంట్ చేపట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో నాలుగు సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ఖజానాకు రూ. 12,600 కోట్లు వచ్చాయి.