బెంగళూరులో వాద్రా భూప్రకంపనలు! | robert vaadra's land scam in bangalore | Sakshi
Sakshi News home page

బెంగళూరులో వాద్రా భూప్రకంపనలు!

Published Sat, Jun 10 2017 7:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

బెంగళూరులో వాద్రా భూప్రకంపనలు!

బెంగళూరులో వాద్రా భూప్రకంపనలు!

  • రూ.850 కోట్ల విలువైన 60 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
  • అందులో డీఎల్‌ఎఫ్‌ అపార్ట్‌మెంటు: బీజేపీ నేతల ఆరోపణ
  • ఆధారాల విడుదల
  •  
    బనశంకరి (బెంగళూరు):
    ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భారీ భూ కుంభకోణానికి పాల్పడినట్లు బెంగళూరు బీజేపీ నేతలు ఆరోపించారు. నగరంలోని బన్నేరుఘట్టరోడ్డులోని బేగూరు గ్రామంలో రూ.850 కోట్లకు పైగా విలువైన 60.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నగర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌ఆర్‌.రమేశ్‌ చెప్పారు. శనివారం బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2,350 పేజీలతో కూడిన ఆధారాలను ఆయన విడుదల చేశారు. 2004లో మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం వచ్చాక కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లోని ఈ అటవీప్రాంతాన్ని కబ్జా చేశారన్నారు.

    దీనిలో డీఎల్‌ఎఫ్‌ సంస్థ భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించిందన్నారు. అటవీ ప్రదేశం, శ్మశానం, గుట్టలతో కూడిన ప్రభుత్వభూమిని రాబర్ట్‌వాద్రా, డిఎల్‌ఎఫ్‌ వెస్టెండ్‌ హైట్స్‌ అపార్టుమెంట్ల నిర్మాణం కోసం కబ్జాకు పాల్పడ్డారని ఎన్‌ఆర్‌.రమేశ్‌ ఆరోపించారు. మెసర్స్‌ ఎనేబుల్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఈ భూములను కొందరు కాంగ్రెస్‌ నాయకులు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించారన్నారు. ఈ వ్యవహారంలో అనేక నకిలీ పట్టాలు, రవిచంద్ర, కిరణ్‌ ఇతర కాంగ్రెస్‌ నేతల పేరుతో నకిలీ మ్యుటేషన్లను తయారుచేశారన్నారు.

    అన్నీ అక్రమ అనుమతులే
    18 అంతస్తులతో కూడిన భారీ అపార్టుమెంటును, 2345 కార్లు పార్కింగ్‌ సామర్థ్యంతో నిర్మించారని రమేష్‌ చెప్పారు. బెంగళూరు డెవలప్‌మెంట్‌ అథారిటీ (బీడీఏ) ఈ భూముల సర్వే చేపట్టకుండానే ఈ ప్లాన్‌కు ఆమోదం మంజూరు చేసిందని దుయ్యబట్టారు. 40కి పైగా సర్వే నెంబర్లు, 100కి పైగా వ్యవసాయదారుల పేర్లతో ఉన్న 60.04 భూములకు అక్రమంగా ఖాతా పొందారన్నారు. రెండు స్థలాల మధ్య ఇతరుల స్థలాలు ఉంటే విలీనానికి అవకాశం లేకపోయినా ఇక్కడ మాత్రం అలా చేశారన్నారు. భూమిని కొనాలంటే రైతుల వంశవృక్ష ధ్రువీకరణ పత్రం తీసుకుని అందులో కుటుంబంలో అందరి నుంచి ఎన్‌ఓసీ తీసుకోవలసి ఉంటుందని, దానిని కూడా పాటించలేదని ఆరోపించారు. దీనిపై గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు.

    ఈ భూములపై కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఖాతాలు మంజూరు చేశారని విమర్శించారు. అపార్టుమెంటు కోసం బేగూరు చెరువు నుంచి హుళిమావు చెరువుకు అనుసంధానంగా ఉన్న రాజకాలువను కూడా మూసివేశారని తెలిపారు. దీనిపై నగర జిల్లా కలెక్టర్ శంకర్‌కు, ఏసీబీకి, వాద్రా- డీఎల్‌ఎఫ్‌ కుంభకోణాలపై విచారణ చేపడుతున్న ఈడీకి పూర్తి ఆధారాలను అందజేయడం జరిగిందని రమేశ్‌ తెలిపారు. సోమవారం ఆ భూములను పరిశీలిస్తానని కలెక్టర్‌ శంకర్‌ హామీ ఇచ్చారన్నారు. రాబర్ట్‌వాద్రా భూ కుంభకోణంపై సీబీఐ లేదా సీఐడి విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను డిమాండ్‌ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement