
వెంటపడి తరిమి తరిమి మరీ..!
అన్నానగర్: వెంటపడి ఓ వ్యక్తిని నరకడం మనం సినిమాలో చూస్తుంటాం. కానీ అలాంటి సంఘటనలు నేడు నిజ జీవితంలో జరుగుతున్నాయి. మదురై జైలు నుంచి జామీనుపై బయటకు వచ్చిన ఓ రౌడీని ముగ్గురు వ్యక్తులు పట్టపగలు తరిమి, తరిమి నరికి హత్య చేశారు. నింధితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుప్పాణడి ప్రాంతానికి చెందిన సెన్బగమ్ కుమారుడు ఆర్ముగమ్(24) పేరు మోసిన రౌడీ. ఇతను గతంలో ఓ హత్య కేసులో అరెస్టు అయ్యి ఇటీవల జామీనుపై బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న ఆర్ముగమ్‌కు కొందరు ఫోన్ చేసి బయటకు పిలిచారు. బైక్ పై పాత రామనాధపురం వైపు వెళుతున్న అతనిని వెనుక నుంచి ముగ్గురు బైక్‌తో వెంబడించారు.
వారిని గమనించిన అతను తన బైక్‌ను విడిచి పరుగెత్తాడు. వెంబడిస్తున్న వాళ్లు అతన్ని తరుముకుంటూ వెళ్లి అతి కిరాతంగా నరికి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదినా అదే ప్రాంతానికి చేందిన ఇరుదయరాజా, అతని స్నేహితులు గణేశమూర్తి, కార్తీక్‌లపై ఆర్ముగమ్ తన స్నేహితులతో కలిసి ఇనుప చువ్వలతో దాడి చేశాడు.
ఈ దాడిలో గాయపడిన గణేశమూర్తి మృతి చెందాడు. ఈ హత్య కేసులో ఆర్ముగమ్ జైలు కెళ్లి ఇటీవలే జామీనుపై బయటకు వచ్చాడు. చనిపోయిన ఇరుదయరాజా సంబంధీకులు పగ తీర్చుకోవడనికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఆర్ముగమ్‌ను పోలీసులు హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్ముగమ్ హత్య చేయబడ్డాడు. ఈ క్రమంలో ఇరుదయరాజా బంధువులే హత్య చేసి ఉంటారనే కోణంలో శుక్రవారం పోలీసులు విచారణ చేపట్టారు. హంతకులను పట్లుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.