వైజాగ్‌ యువతి హత్యకేసులో రౌడీషీటర్‌ హస్తం!  | Rowdy Sheeter Involved In Divya Murder Case | Sakshi
Sakshi News home page

దివ్య హత్య కేసులో రౌడీషీటర్‌ హస్తం! 

Published Fri, Jun 12 2020 9:34 AM | Last Updated on Fri, Jun 12 2020 9:34 AM

Rowdy Sheeter Involved In Divya Murder Case - Sakshi

నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీపీ ఆర్కే మీనా

సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో సంచలనం రేపిన దివ్య హత్య కేసులో ఓ రౌడీషీటర్‌ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడయింది. పోలీసు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు వసంత, గీతలను నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ మీనా రెండో రోజు గురువారం నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో వేర్వేరుగా విచారించగా ఈ కీలక విషయం వెల్లడైనట్లు తెలిసింది. హత్యకు ఓ రౌడీషీటర్‌ సహకరించినట్లు సీపీకి వసంత తెలిపినట్లు తెలిసింది. మరోవైపు వసంత మరిది సంజయ్య ఫోన్‌లోని డేటా డిలీట్‌ చేసేందుకు సహకరించిన దొండపర్తిలోని ఓ సెల్‌ షాపు యజమానినీ పోలీసులు విచారించారు. అయితే తన షాపు వద్దకు వచ్చి ఫోన్‌లోని డేటా డిలీట్‌ చేయాలని సంజయ్య కోరగా... ఫోన్‌కు సంబంధించిన పత్రాలు, ఆధార్‌ కార్డు తీసుకురమ్మని చెప్పానని... అవి తీసుకొచ్చాకే డేటా డిలీట్‌ చేశానని... అంతకు మించి తనకే సంబంధం లేదని విచారణలో ఆ షాపు యజమాని వెల్లడించినట్లు తెలిసింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీపీ ఆర్‌కే మీనా వివిధ కోణాల్లో వసంత, గీతను విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు. 

ఆరు రోజులు చిత్రహింసలు పెట్టి...  
అనంతరం సీపీ రాజీవ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ దివ్య హత్య అత్యంత క్రూరమైనదని అన్నారు. దివ్యను ఆమె పిన్ని అమ్మేయడంతో ఇంటి పనికి తీసుకొచ్చిన వసంత వ్యభిచార ఊబిలోకి దింపిందని గుర్తు చేశారు. అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో తిండి పెట్టకుండా ఆరో రోజులపాటు చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. దివ్యని వివాహం చేసుకున్న వీరబాబుకు కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్‌  అమ్మమ్మ నాగమణి ఓ రౌడీషీటరు చేతిలో హత్యకు గురయ్యారని తెలిసిందని... ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నామని స్పష్టం చేశారు. హత్యతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం రెండు బృందాలు ఇప్పటికే రావులపాలెం, ఏలేశ్వరం పంపించామని తెలిపారు. ప్రస్తుతం వసంత, గీతను విచారిస్తున్నామని.., రిమాండ్‌లో ఉన్న మిగిలిన నలుగురినీ పోలీస్‌ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరగా... కోర్టు అనుమతించడంతో వారిని శుక్రవారం నుంచి విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తామని తెలిపారు.  

విశాఖలో హల్‌చల్‌ చేసిన చిట్టిమాము గ్యాంగ్‌ పుట్టిన రోజు పార్టీకి సంబంధించి చేపట్టిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర ముఠా మోసగాడు జవహర్‌ బాలకుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. బాలకుమార్‌ చేతిలో అనేక మంది మహిళలు మోసపోయారని పేర్కొన్నారు. దివ్య హత్యకేసు విచారణలో ఈస్టు ఏసీపీ కులశేఖర్, సీఐ కోరాడ రామారావు, ఎస్‌ఐలు శ్రీనివాస్, గౌరి, సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement