మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రింగురోడ్డు నిర్మాణంలో ఏకంగా రూ. 184 కోట్ల అవినీతి బయటపడింది. ఢిల్లీలోని షీలాదీక్షిత్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2010లో కామన్వెల్త్ క్రీడలకు ముందు రింగ్ రోడ్ బైపాస్ నిర్మాణంలో ఈ అవినీతి జరిగిందని, దీనిపై ఏసీబీ విచారణ జరిపించాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏసీబీ ముందుగానే ఓ ఎఫ్ఐఆర్ దాఖలుచేసి విచారణ మొదలుపెట్టింది.
ఇందులో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పాత్రను కూడా శోధించనున్నారు. సాలింగఢ్ కోట నుంచి వెలోడ్రమ్ రోడ్డు వరకు నిర్మించిన రింగురోడ్డులో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు ప్రధానమంత్రి నియమించిన షుంగ్లు కమిటీ తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా చేసి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీని మొత్తం విలువ రూ. 407 కోట్లు. ఈ ప్రాజెక్టులో సామగ్రితో పాటు కూలీల ఖర్చును కూడా కాంట్రాక్టర్లు ఎక్కువ చేసి చూపించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 184 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణతో నిగ్గుతేల్చాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది.
రింగు రోడ్డులో రూ. 184 కోట్ల స్కాం
Published Sat, Feb 8 2014 11:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
Advertisement
Advertisement