'చల్ల'గా లాగించేస్తున్నారు | Rs 3,500 crore in the domestic ice cream market | Sakshi
Sakshi News home page

'చల్ల'గా లాగించేస్తున్నారు

Published Wed, Mar 25 2015 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM

'చల్ల'గా లాగించేస్తున్నారు

'చల్ల'గా లాగించేస్తున్నారు

 రూ.3,500 కోట్లకు దేశీ ఐస్‌క్రీమ్ మార్కెట్
 సగటు వినియోగం 400 ఎంఎల్    మూడో స్థానంలో హైదరాబాద్
 ప్రపంచ వ్యాప్తంగా వినియోగం: 1520 కోట్ల  లీటర్లు
 భారత్‌లో బ్రాండెడ్ కంపెనీల అమ్ముతున్నది: 19 కోట్ల లీటర్లు

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 ఐస్‌క్రీమ్ అమ్మకాలు దేశవ్యాప్తంగా ఊహించని స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సగటు తలసరి వార్షిక వినియోగం 2012లో 300 మిల్లీ లీటర్లుంటే, ఇప్పుడు ఏకంగా 400 ఎంఎల్‌కు చేరుకుంది. అమ్మకాల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు కేవలం వేసవిపైనే ఆధారపడితే.. దక్షిణాదితోపాటు పశ్చిమ రాష్ట్రాల వాసులు ఏడాది పొడవునా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తున్నారు. రూ.3,500 కోట్ల విపణిలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా దేశీయ కంపెనీలు కొత్త రుచులతో పోటీ పడుతున్నాయి. వెరశి కస్టమర్లు నోరూరించే విభిన్న రుచులను ఎంజాయ్ చేస్తున్నారు. ధరలు పెరుగుతున్నా ఏటా వినియోగం అధికమవడాన్నిబట్టి చూస్తే భారతీయ కస్టమర్ ధర ఎంతైనా వెచ్చిస్తారని దిగ్గజ బ్రాండ్ అమూల్ అంటోంది.
 
 చల్లని అవకాశాలు..
 దేశంలో ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో 2012లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఉత్పత్తుల్లో ఐస్‌క్రీమ్ కూడా ఒకటి. ఇంకేముంది విదేశీ బ్రాండ్ల రాకతోపాటు దేశీయ కంపెనీలు విస్తరణపై దృష్టి పెట్టాయి. జాతీయ స్థాయి బ్రాండ్‌గా నిలిచేందుకు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగ ళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా మార్కెట్లలో దేశీయ కంపెనీలు పాగా వేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా స్థానిక బ్రాండ్లు కోకొల్లలుగా విస్తరిస్తున్నాయి. ఇక వినియోగంలో ఢిల్లీ, ముంబైల తర్వాతి స్థానం హైదరాబాద్‌దే. మొత్తంగా పశ్చిమ రాష్ట్రాలు 35 శాతం, ఉత్తరాది 30, దక్షిణాది 20, తూర్పు, మధ్య భారత్ 15 శాతం వాటాకు పరిమితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 15.2 బిలియన్ లీటర్ల ఐస్‌క్రీమ్ ఆరగించేస్తున్నారు. ఇందులో ఆసియా పసిఫిక్ దేశాలు 34 శాతం వాటా దక్కించుకున్నాయి. ప్రపంచ సరాసరి 2.3 లీటర్లుంది. అమెరికా వాసుల సగటు వినియోగం 24 లీటర్లు, ఆస్ట్రేలియాలో 18 లీటర్లు ఉంటే, భారత్‌లో 400 మిల్లీలీటర్లు మాత్రమే.
 
 ప్రీమియం అయినా..: ముడి పదార్థాల ధరలకుతోడు, వినియోగదార్లలో ఖర్చు చేయతగ్గ ఆదాయాలు పెరుగుతుండడంతో అధిక మార్జిన్ ఉన్న ప్రీమియం ఐస్‌క్రీమ్‌ల విభాగంపైనా కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. అమూల్-ఎపిక్, మదర్ డెయిరీ-బెల్జియుమ్, క్వాలిటీ వాల్స్-మాగ్నమ్ బ్రాండ్లు ప్రీమియం విభాగంలో ఇటీవలే కొత్తగా వచ్చి చేరాయి. సూపర్ ప్రీమియం బ్రాండ్‌ను క్రీమ్ బెల్ కంపెనీ ఈ ఏప్రిల్‌లో విడుదల చేస్తోంది. భారత్‌లో ప్రీమియం ఐస్‌క్రీమ్‌కు డిమాండ్ ఉందని అమూల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ ఆర్.ఎస్.సోధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రపంచంలో తొలిసారిగా కోన్స్‌లో షుగర్ ఫ్రీ, అలాగే ఫ్లావ్యో ఫ్రోజెన్ యోగర్ట్ వేరియంట్లను అమూల్ పరిచయం చేసిందని ఆయన చెప్పారు. బెల్జియుమ్ తయారీకి మదర్ డెయిరీ బెల్జియం నుంచి మిల్క్ చాకొలేట్, ఫ్రాన్స్-వెనిల్లా ఫ్లేవర్, కాలిఫోర్నియా-బాదం, స్విట్జర్లాండ్ నుంచి బెటా కెరోటీన్‌ను తెప్పిస్తోంది. బెల్జియూమ్ 80 ఎంఎల్ ఐస్‌క్రీమ్ ధర రూ.80 ఉంది.
 
 బ్రాండెడ్ కంపెనీలదే..
 భారత్‌లో ఐస్‌క్రీమ్ వ్యాపారంలో వ్యవస్థీకృత రంగ కంపెనీలదే హవా నడుస్తోంది. మొత్తం పరిశ్రమ రూ.3,500 కోట్లుంటే, ఇందులో రూ.2,200 కోట్ల వాటాను బ్రాండెడ్ కంపెనీలు కైవసం చేసుకున్నాయి. అమూల్ వాటా ఏకంగా 42 శాతముంది. వ్యవస్థీకృత రంగంలో ప్రస్తుతం ఏడాది పొడవున దేశంలో 19 కోట్ల లీటర్ల ఐస్‌క్రీమ్ అమ్ముడవుతోంది. పరిశ్రమ 2015లో 15 శాతం వృద్ధి ఆశిస్తోంది. దేశంలో అమూల్, మదర్ డైరీ, క్రీమ్ బెల్, వాదిలాల్, దిన్‌షాస్‌తోపాటు హాగెన్ డాజ్స్, బాస్కిన్ రాబిన్స్, లండన్ డెయిరీ, న్యూజిలాండ్ నేచురల్స్, హాకీ పాకీ, మినీ మెల్ట్స్, స్వెన్‌సెన్స్ వంటి విదేశీ బ్రాండ్లు దూసుకెళ్తున్నాయి. భారత్‌లో తలసరి వినియోగం తక్కువ. అందుకే కంపెనీలు భిన్నంగా ఆలోచిస్తేనే మార్కెట్ వృద్ధికి ఆస్కారం ఉంటుందని మదర్ డెయిరీకి చెందిన డెయిరీ విభాగం బిజినెస్ హెడ్ సుభాషిశ్ బసు తెలిపారు.
 
 భారత్‌లో వినియోగం
 పశ్చిమ రాష్ట్రాలు    35 శాతం
 ఉత్తరాది    30 శాతం    
 దక్షిణాది    20 శాతం
 తూర్పు, మధ్య భారత్    15 శాతం
 టాప్ సిటీస్:  ఢిల్లీ, ముంబై, హైదరాబాద్
 
 భారత్‌లో ఐస్‌క్రీమ్ మార్కెట్
 రూ. 3,500 కోట్లు
 వ్యవస్థీకృత రంగం వాటా
 రూ. 2,200 కోట్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement