ఆర్బీఐ ఎంట్రీ.. రూపాయి రికవరీ!
ఆర్బీఐ ఎంట్రీ.. రూపాయి రికవరీ!
Published Tue, Nov 29 2016 8:14 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM
ముంబై : పాతాళ స్థాయికి పడిపోయిన రూపాయి విలువ మంగళవారం ట్రేడింగ్లో కోలుకుంది. ఆర్బీఐ రంగంలోకి దిగడంతో అమెరికా కరెన్సీ డాలర్కు వ్యతిరేకంగా రూపాయి విలువ 11 పైసలు లాభపడి 68.65గా ముగిసింది. బ్యాంకులు, ఎగుమతిదారుల ద్వారా ఆర్బీఐ డాలర్ అమ్మకాలు చేపట్టడంతో రూపాయి తేరుకున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి అక్కడ ద్రవ్యోల్బణం పెరగొచ్చనే సంకేతాలతో తిరుగులేకుండా డాలర్ దూసుకుపోతోంది. దీంతో దేశీయ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి.
సోమవారం సైతం రూపాయి 30 పైసలు పడిపోయి రికార్డు కనిష్ట స్థాయిలో నమోదైంది. సమీప కాలంలో ఫెడ్ రేట్ల పెంపు కూడా రూపాయిని భారీగా ఒడిదుడుకులకు గురిచేస్తోంది. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్ విక్రయాలు చేపట్టిందని ఓ ఫారెక్స్ డీలర్ చెప్పారు. ఈ విక్రయాలతో ఇంటర్బ్యాంకు ఫారిన్ ఎక్స్చేంజ్(ఫారెక్స్) మార్కెట్లో దేశీయ కరెన్సీ స్వల్పంగా కోలుకుందని, అనంతరం 68.62, 68.78ల మధ్య వద్ద కదలాడి చివరకు 68.65వద్ద ముగిసినట్టు వెల్లడించారు.
Advertisement