చివర్లో పెరిగిన రూపాయి
ముంబై: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బుధవారం ట్రేడింగ్‌లో భారీ హెచ్చుతగ్గులకు లోనై రోలర్ కోస్టర్ ప్రయాణాన్ని తలపించింది. క్రితం ముగింపు 67.63తో పోలిస్తే ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 68.10 వద్ద బలహీనంగా మొదలైంది. ఒక దశలో 68.62 వద్ద కనిష్టాన్ని తాకింది. తరవాత నెమ్మదిగా పుంజుకోవడం మొదలైంది. ఈ బాటలో బలపడుతూ వచ్చిన రూపాయి గరిష్టంగా 66.80ను సైతం చేరింది. చివరకు 56 పైసలు బలపడి 67.07 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లలో డాలరు విలువ క్షీణించడం రూపాయి రికవరీకి దోహదపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి 163 పైసలు కోల్పోవటం తెలిసిందే. ఒక దశలో రిజర్వ్ బ్యాంకు కల్పించుకుని స్పాట్ మార్కెట్లో డాలర్లను భారీగా విక్రయించడం కూడా రూపాయికి బలాన్నిచ్చిందని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు విదేశీ వాణిజ్య రుణాలను సాధారణ కార్పొరేట్ వ్యవహారాలకు కంపెనీలు వినియోగించుకోవచ్చునని ఆర్‌బీఐ చెప్పటంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు.