రష్యాకు ఎదురుదెబ్బ!
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో అగ్రరాజ్యం రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. సిరియా అధ్యక్షుడు అల్ బషర్ అసద్ అలెపో నగరంలో జరిపిన దాడికి మద్దతునివ్వడం ద్వారా రష్యా యుద్ధనేరాలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో హక్కుల మండలిలో ఆ దేశానికి చుక్కెదురైంది. హక్కుల మండలిలో సభ్యత్వం కోసం రష్యా చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది.
47 మందితో కూడిన హక్కుల మండలిలో తాజాగా 14 దేశాలకు సభ్యత్వం కల్పించేందుకు 193మంది సభ్యులతో కూడిన ఐరాస జనరల్ అసెంబ్లీ ఓటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో 112 ఓట్లు మాత్రమే సాధించిన రష్యా హంగేరి, క్రోషియా చేతిలో ఓడిపోయింది. హక్కుల మండలిలో రష్యా సభ్యత్వాన్ని దాదాపు 87 హక్కుల సంఘాలు వ్యతిరేకించాయని హక్కుల మండలి ఐరాస డిప్యూటీ డైరెక్టర్ అక్షయకుమార్ తెలిపారు. ‘అలెపోలో జరిగిన అరాచకాలను మరిచిపోవడం అంత సులభం కాదు. ఓటు వేసిన వారి మనసులో ఆ ఘటనలు గుర్తుండిఉంటాయి’ అని ఆయన తెలిపారు. రష్యాకు ఇది చరిత్రాత్మక తిరస్కరణ ఆయన స్పష్టం చేశారు. అమెరికా-రష్యా కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవ్వడంతో అలెపో నగరంలో పరిస్థితులు మరింత దారుణంగా మారి సంక్షోభం మరింత ముదిరింది. రష్యా మద్దతున్న అసద్ ప్రభుత్వం తూర్పు అలెప్పో నగరంలో బలంగా ఉన్న తిరుగుబాటుదారులను ఏరివేసేందుకు భారీ ఎత్తున దాడులు జరుపుతుండటంతో ఇక్కడ ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.