రాజ్యసభలో అందరి కళ్లూ సచిన్ మీదే
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో తమ వాణి గట్టిగా వినిపించడంతో పదే పదే వాయిదా పడ్డాయి. అయితే, ఇన్ని సంఘటనల మధ్య కూడా రాజ్యసభలో అందరి కళ్లు ఒక వ్యక్తి మీదే ఉన్నాయి. ఆయనెవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తెలుపు, నీలం చారల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకుని.. కుడిచేతికి కడియం, రెండు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఎడమచేతికి వాచీ పెట్టుకున్న టెండూల్కర్.. సోమవారం నాటి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యాడు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి సభ ప్రారంభం కావడానికి చాలా ముందుగానే వచ్చేశాడు.
గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బాలీవుడ్ నటి రేఖ, వ్యాపారవేత్త అను ఆగాలతో కలిసి రాజ్యసభకు నామినేట్ అయిన టెండూల్కర్.. తన సీటులో కూర్చునే ముందు పలువురు ఎంపీలతో కరచాలనం చేశాడు. తర్వాత తన పక్కనే కూర్చున్న ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్తో మాటల్లోకి దిగాడు. సచిన్ భార్య అంజలి కూడా పార్లమెంటుకు వచ్చి, సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభినందనలు తెలియజేయగా, సచిన్ బల్లమీద చరిచి తన హర్షం వ్యక్తం చేశాడు. సీమాంధ్ర ఎంపీల ఆందోళనతో సభ పది నిమిషాలు వాయిదా పడగా, చాలామంది ఎంపీలు సచిన్ వద్దకు వచ్చి, చేతులు కలిపారు. తర్వాత టెండూల్కర్ లేచి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.