సడక్ నిధులకు సడన్ గండి
పీఎంజీఎస్‌వై నిధుల్లో కేంద్రం కోత
పంచాయతీరాజ్ రోడ్లపై ప్రభావం
106 వంతెనల నిర్మాణానికి అనుమతి నిరాకరణ
హైదరాబాద్: సడక్ నిధుల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. అర్ధాంతరంగా నిధుల్లో కోత విధించింది. దీంతో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణపనులపై ప్రభావం పడే అవకాశముంది. ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కేంద్రం గండికొట్టింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.774.92 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను కేంద్రానికి పంపారు. ఈ మేరకు రాష్ట్రానికి రూ.544.34 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మొదట ఆమోదం తెలిపింది. కాని, అకస్మాత్తుగా కొర్రీ పెట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణకు కూడా కేంద్రం కోత విధించింది. రాష్ట్రానికి రావాల్సిన దాంట్లో 22 శాతం (రూ.122కోట్లు) నిధులనే మంజూరు చేసింది. దీంతో కేంద్ర నిధులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంచాయతీ రోడ్ల నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం పడనుంది.
బ్రిడ్జిల నిర్మాణానికి బ్రేక్
గ్రామీణ రహదారుల మధ్య అవసరమైన చోట చేపట్టిన వంతెనల నిర్మాణాలకు కూడా కేంద్రం బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 106 వంతెనల నిర్మాణం కోసం రూ.132.52 కోట్ల అంచనాతో పంచాయతీరాజ్ విభాగం గతేడాది ఆగస్టులో కేంద్రానికి ప్రతిపాదనలను పం పింది. ఇంతవరకు అనుమతులు లభించలేదు. మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల సమీక్ష సందర్భంగా ఈ వ్యవహారాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి దృష్టికి తెచ్చారు. కేంద్రంతో చర్చించి నిధులు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు.