అందరూ ఒకేసారి చనిపోవాలని.. | sakshi focus | Sakshi
Sakshi News home page

అందరూ ఒకేసారి చనిపోవాలని..

Published Sun, Aug 28 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

అందరూ ఒకేసారి చనిపోవాలని..

అందరూ ఒకేసారి చనిపోవాలని..

  తల్లి సహా ఆత్మహత్య చేసుకున్న తనయులు
  కుమారులు, భార్యను పోగొట్టుకుని ఒంటరైన ఓ తండ్రి కథ ఇది.
  కొత్తపల్లి మండలం అమరవిల్లిలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన
  చక్కని కుటుంబంలో చిచ్చు రేపిన కిడ్నీ రోగం

తూర్పు గోదావరి జిల్లా :

నీకేంటయ్యూ..ముగ్గురు కొడుకులూ అందొచ్చారంటే.. నువ్వు మారాజువి, మీ ఆవిడ మహారాణే’ అని తోటివారన్నప్పుడు ఆయన మురిసిపోయూడు. విధికి తనపై కన్ను కుడుతుందనీ కలలోనైనా శంకించలేదు. బిడ్డలపై పాడు వ్యాధి పడగనీడలా కమ్ముకుంటుంటే తట్టుకోలేక పోయూడు. విధిని ఎదిరించలేకా, వ్యాధికి చికిత్స చేరుుంచలేకా తానే లోకాన్ని వీడాలనుకున్నాడు. ఆయన వ్యధను చూడలేని బిడ్డలూ, భార్యా  తామే లోకం నుంచి నిష్ర్కమించారు. ఇప్పుడాయన బతుకు శిశిరం వేళ మోడు. గుండె పచ్చి పుండు. గత నెలలో కొత్తపల్లి మండలం అమరవిల్లిలో జరిగిన హృదయ విదారక విషాదంపై ‘సాక్షి’ ఫోకస్..        
 
 2016 జూలై ఆరో తేదీ రాత్రి..
 ఊళ్లో వాళ్లందరూ నిద్ర లో ఉన్నారు.
 ఆ ఇంటిలో మాత్రం లైట్లు
 వెలుగుతూనే ఉన్నాయి.
 ఏదో తెలియని అలజడి..
 కుటుంబసభ్యులంతా
 తీవ్ర చర్చలో ఉన్నారు.

 
 ‘మీరు లేకుండా నేను ఎలా బతకాలిరా? అది నా వల్ల కాదు.. ముందు నేనే చనిపోతా’ అంటూ తండ్రి. ‘లేదు..లేదు నాన్నా! మేము బతికుండడం అమ్మకూ, నీకూ భారమే. అందుకే మేమే  చనిపోతాం’ అంటూ ముగ్గురు కుమారులు.. ఇలా అర్ధరాత్రి వరకూ వారి మధ్య విషాదభరిత వాదం జరిగింది. తెల్లారేసరికి కొడుకులు  జన్మనిచ్చిన తల్లితో కలిిసి విషం తాగి, జలసమాధి కాగా .. ఆ కుటుంబ యజమాని కమ్ముకున్న శోకాంధకారంలో  ఏకాకిలా మిగిలాడు.
 
 
 కిడ్నీలు మారిస్తే పిల్లలు బతికే
 అవకాశం ఉందని, అయితే దానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు దానికీ సిద్ధపడ్డారు. ఆస్తులు అమ్మై సరే పిల్లలను బతికించుకోవాలనుకున్నారు. అంతే కాదు వారి కిడ్నీలు పిల్లలకు ఇవ్వడానికీ రెడీ అయ్యారు. ఒక కుమారుడికి తండ్రి, మరో కుమారుడికి తల్లి కిడ్నీ ఇస్తే.. మూడో కుమారుడి పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు.
 
 ఆ రాత్రే.. కాళరాత్రి..
 కన్న బిడ్డలు అనారోగ్యంతో తమ ముందే కళ్లు మూస్తే ఇక తాము బతికి సాధించేదేముందని జాలై ఏడో తేదీ రాత్రి తల్లిదండ్రులు తీవ్రంగా చర్చించుకున్నారు.‘ పిల్లలు లేకుండా నేను బతకలేను’ అంటూ తండ్రి.  ‘లేదు నాన్నా.. మా వల్ల అమ్మ, నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమే చనిపోతాం’ అని పిల్లలు ఇలా రాత్రంతా వారు తీవ్రంగా మథనపడ్డారు.
 
 తెల్లారేసరికి..
 తల్లి, ఆమె ముగ్గురు కుమారులు సమీపంలోని ఉప్పుటేరులో శవాలుగా తేలారు. ఆ రాత్రి తండ్రికి చెప్పినట్టుగానే ప్రాణాలు తీసుకుని.. ఆ తండ్రిని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. జీవితాంతం కలిసి ఉంటానన్న భార్య కూడా పిల్లల వెంటే వెళ్లి భర్తను ఒంటరిని చేసింది. ఎదిగొచ్చిన కొడుకులతో జీవితం సాఫీగా సాగాల్సిన ఆ తండ్రి ఇదిగో ఇలా దీనంగా.. దిక్కులేని వాడిగా మారాడు. భార్య, పిల్లల జ్ఞాపకాలను మరచిపోలేక మంచాన పట్టాడు. ఏకాంత జీవనం గడుపుతున్నాడు.
 
 తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమరవిల్లి గ్రామమది. ఆ గ్రామంలో రాగల రాము, భూలక్ష్మిలకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇక ముగ్గురు కుమారులు ప్రభు ప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్(18). కొంత వరకు చదువుకున్న వీరు ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్దే ఉంటున్నారు.
 
 అస్వస్థతకు గురై..
 నాలుగేళ్ల క్రితం చిన్న కుమారుడు ప్రేమసాగర్ అస్వస్థతకు గురయ్యాడు. ఇతడిని కాకినాడలోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు అతడికి కీడ్నీలు పాడయ్యాయని ఆపరేషన్ చేయాలన్నారు. కొంత కాలం వరకు డయాలసిస్ చేయించాలని చెప్పగా.. నాలుగేళ్ల నుంచి వైద్యం చేయిస్తున్నారు. మిగిలిన ఇద్దరు కుమారులు ప్రభు ప్రకాష్, అనిల్ కుమార్‌లు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారినీ ఆస్పత్రిలో చూపించిన తల్లిదండ్రులకు వైద్యులు షాక్ ఇచ్చారు. వారి కిడ్నీలు పాడయ్యాయని, ఆపరేషన్ చేయించక తప్పదని ఆ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
 
 మానసిక సంఘర్షణ మధ్య...
 ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురి కుమారులకు ఒకే విధమైన ఆరోగ్య సమస్య రావడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తమ్ముడికి ఒంట్లో బాగోకపోతే అన్నయ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లడం, అన్నయ్యకు ఒంట్లో బాగోకపోతే తమ్ముళ్లు ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ఇక ముగ్గురూ అనారోగ్యంతో ఉంటే తల్లిదండ్రులే ఊరికి సుమారు 30 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న కాకినాడకు పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా తీసుకువెళ్లేవారు. మరోవైపు వైద్యులు వంశపారంపర్యంగా పిల్లలకు ఆరోగ్య సమస్య వచ్చిందని, ఎంత ఖర్చు చేసినా వారు బతకడం కష్టమేనని చెప్పడంతో ముఖ్యంగా తల్లి మానసికంగా కుంగిపోయింది. తన సోదరులు ఇదే ఆరోగ్య సమస్యతో ప్రాణాలు కోల్పోవడంతో తన పిల్లలూ అదే వ్యాధితో చనిపోతారనే బెంగతో ఆమె తల్లడిల్లిపోయేది.
 
 అందరం ఒకేసారి చనిపోవాలని..
 ‘నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు. మన వల్ల ఆయన మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ఏం చేద్దాం అమ్మా?’ అంటూ కుమారులు తల్లితో అన్నారు. అనారోగ్యంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనం.. నాన్నను బతికించుకుని మనమే తనువు చాలిద్దామని నిర్ణయించుకున్నారు. దానికి తల్లి కూడా సరేనంది. అంతే ఆ అర్ధరాత్రే నలుగురూ కలిసి పురుగు మందు తాగారు. అంతే కాదు. ఏ ఒక్కరూ బతికి  ఉండకూడదని నిర్ణయించుకుని తాడుతో కట్టుకుని మరీ ఉప్పుటేరులోకి దూకారు. ఆ తండ్రిని ఒంట రిని చేసి వెళ్లిపోయారు. డిగ్రీ వరకు చదువుకుని చదువు మానేసిన పెద్ద కొడుకులిద్దరూ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరిస్తుండగా చిన్న కుమారుడు ప్రేమ ప్రకాష్ పదో తరగతి వరకూ చదివి, అనారోగ్యం రావడంతో మానేశాడు. అప్పటి వరకు తమతో క్రికెట్ ఆడుతు సరదాగా ఉండే ప్రకాష్ గత కొన్ని రోజుల నుంచి ఆటలకు కూడా రావడం లేదని తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.
 
 
 సాధికార సర్వేలో ఈ అంశం చేర్చాలి
 ప్రభుత్వ సాధికార సర్వేలో ఆరోగ్యానికి సంబంధించి, దీర్ఘకాలిక వ్యాధులు వివరాలు తెలిపే అంశం చేర్చాలి. దానివల్ల ఈ వ్యాధులు సోకిన వారి గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉంటే రాబోయే రోజుల్లోనైనా ఎటువంటి సహాయం అందించాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారిలో మనోధైర్యం నింపడానికి  అవగాహన సదస్సులు నిర్వహించవచ్చు. భవిష్యత్తులో ఎవరూ బలవన్మరణాలకు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
 - తూతిక శ్రీనివాస విశ్వనాథ్,
 ఎంపీడీఓ, అంబాజీపేట

 
 
 మనిషి.. మనిషిలో లేడు.
 పిల్లలను కాపాడుకునేందుకు అన్న, వదిన ఎంతో కష్టపడ్డారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చాలా వరకు ఖర్చుపెట్టారు. అయినా వారికి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కిడ్నీల వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పడంతో లోలోపల కుమిలిపోయేవారు. వదిన, పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో అన్నయ్య ఇలా ఒంటరయ్యాడు. మనిషి.. మనిషిలో లేడు.
 - రాగల అప్పలరెడ్డి,
 రాము తమ్ముడు, అమరవిల్లి

 
 కలలో కూడా ఊహించ లేదు..
 మా మనుమల పెళ్లిళ్లు చూడాల్సిన నేను. వాళ్ల చావులు చూడాల్సి వచ్చింది. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఎదిగి అందివచ్చిన సమయంలో మనుమలు, మా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో అల్లుడు అనాథయ్యాడు. అతడిని చూస్తుంటే బాధేస్తోంది.
 - వాకా అప్పయ్మమ్మ, రాము అత్త
 
 మూత్రపిండాల వ్యాధులు ఏ విధంగానైనా రావచ్చు. ముందుగా వాటిని గుర్తించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ డిసీజెస్, స్వెల్లింగ్ ఇలా వివిధ రకాల్లో రావచ్చు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముందుగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు.
 - డాక్టర్ సురేంద్రబాబు, ఎంఎస్,
 ఎంసీహెచ్, యూరాలజీ స్పెషలిస్ట్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement