
సాక్షి, తూర్పు గోదావరి : రానున్న ఎన్నికల్లో తాను గానీ, తన కుటుంబసభ్యులుగానీ పోటీ చేసేది లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలుగా మాత్రం కొనసాగుతామని చెప్పారు. ‘మా’ ట్రస్ట్ కార్యకలాపాలు చూసుకోవాల్సి ఉందని మురళీమోహన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదంటూనే మరోవైపు తనకున్న డిమాండ్లను చంద్రబాబు ముందు పెడుతున్నట్టు తెలిసింది.
కేవలం మురళీమోహన్ మాత్రమే కాకుండా మరి కొంతమంది సిట్టింగ్ టీడీపీ ఎంపీలు సైతం ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం అయితే అనారోగ్య కారణాలుతో ఎంపీగా పోటీ చేయలేనని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో అమలాపురం పార్లమెంట్‌కు టీడీపీ నేతలు మరో వ్యక్తిని పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రజల్లో వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ఆదరణ కారణంగానే టీడీపీ నాయకులు ఓటమి భయంతో పోటీకి దూరమవుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment