east godawari
-
ఇక పురసమరం!
మండపేట: సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారక ముందే స్థానిక సమరానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న ఈసీ తాజాగా మున్సిపల్ పోరుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. జూలై రెండో తేదీతో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తోంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాల కోసం మే 23 వరకూ వేచి చూడాల్సి ఉంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటినుంచీ పంచాయతీలన్నీ ప్రత్యేక పాలనలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జూన్‌లో వీటికి ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 10వ తేదీన పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురించాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలిచ్చింది. మరోపక్క నగర, పుర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం జూలై రెండో తేదీతో ముగుస్తుండటంతో పురపోరు తెరపైకి వచ్చింది. దీంతో నూతన పాలక వర్గాల ఎన్నికకు కూడా ఈసీ సన్నాహాలు చేపట్టింది. జిల్లాలోని కాకినాడ మినహా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మున్సిపాల్టీలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం, గొల్లప్రోలు నగర పంచాయతీలకు 2014 మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే చివరిలో ఫలితాలు వెలువడ్డాయి. జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనంతరం జూలై 3న స్థానిక సంస్థల కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. జూలై 2వ తేదీతో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆయా నగరాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, మే ఒకటో తేదీన ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. గడువు తక్కువగా ఉండటంతో అసెంబ్లీ ఓటర్ల జాబితాల ప్రకారం, వార్డుల వారీగా జాబితాలు సిద్ధం చేసే పనిలో మున్సిపల్ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇందుకోసం ఇంటి నంబర్, వార్డు నంబర్, పోలింగ్ కేంద్రం తదితర వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారో చూసి, ఆ మేరకు కొత్త జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. -
నేను, నా వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయం..
సాక్షి, తూర్పు గోదావరి : రానున్న ఎన్నికల్లో తాను గానీ, తన కుటుంబసభ్యులుగానీ పోటీ చేసేది లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో కార్యకర్తలుగా మాత్రం కొనసాగుతామని చెప్పారు. ‘మా’ ట్రస్ట్ కార్యకలాపాలు చూసుకోవాల్సి ఉందని మురళీమోహన్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదంటూనే మరోవైపు తనకున్న డిమాండ్లను చంద్రబాబు ముందు పెడుతున్నట్టు తెలిసింది. కేవలం మురళీమోహన్ మాత్రమే కాకుండా మరి కొంతమంది సిట్టింగ్ టీడీపీ ఎంపీలు సైతం ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం అయితే అనారోగ్య కారణాలుతో ఎంపీగా పోటీ చేయలేనని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అమలాపురం పార్లమెంట్‌కు టీడీపీ నేతలు మరో వ్యక్తిని పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ ప్రజల్లో వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ఆదరణ కారణంగానే టీడీపీ నాయకులు ఓటమి భయంతో పోటీకి దూరమవుతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. -
కొండల్ని పిండి.. ఘరానా దోపిడీ
మండపేట : అధికార పార్టీ అండతో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. ఎన్నికల కసరత్తులో అధికారులు బిజీగా ఉండటంతో ఇదే అదునుగా కొండల్ని పిండి చేస్తున్నారు. రాజానగరం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుల్ల చేస్తూ, కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలించుకుపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి భారీ యంత్రాలను తెచ్చి మరీ తవ్వకాలు చేస్తుండటం ఇక్కడ జరుగుతున్న ఘరానా దోపిడీకి పరాకాష్ట. ఈ గ్రావెల్‌ను రియల్ ఎస్టేట్ స్థలాలకు తరలించేస్తున్నారు. అనధికార తవ్వకాలతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నా, ప్రభుత్వ భూములు నిరుపయోగంగా మారుతున్నా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడెక్కడంటే.. : రాజానగరం మండల పరిధిలోని సంపత్‌నగరం, యర్రంపాలెం, తుంగపాడు; మండపేట నియోజకవర్గం ద్వారపూడి, కేశవరం; అనపర్తి నియోజకవర్గం అనపర్తి, రంగంపేట, బిక్కవోలు మండలాల్లో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కేశవరం, ద్వారపూడి గ్రామాల్లో రెవెన్యూకు సుమారు 400 ఎకరాల భూములున్నాయి. ఇరవై పైగా పంచాయతీ చెరువులున్నాయి. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు సుమారు 300 ఎకరాలున్నాయి. సాగు నిమిత్తం పంపిణీ చేసిన ఈ భూములు చాలావరకూ అన్యాక్రాంతమై, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు నిలయంగా మారాయి. సమీపంలోని రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో కూడా వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రోడ్డు పక్కన బెర్ములకు వినియోగించే విలువైన ఎర్రమట్టి, పూస గ్రావెల్ ఈ భూముల్లో లభిస్తోంది. దీంతో ఇక్కడి గ్రావెల్‌కు డిమాండ్ ఎక్కువ. ఐదు యూనిట్ల గ్రావెల్ ధర స్థానికంగానే రూ.4 వేల వరకూ ఉండగా, బయటి ప్రాంతాల్లో మరింత ఎక్కువ రేటు పలుకుతోంది. బరితెగించి.. : ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన రెవెన్యూ అధికారులకు స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం.. ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటంతో గ్రావెల్ మాఫియా తాము ఆడింది ఆట పాడింది పాటగా బరితెగించింది. నిర్ణీత స్థలంలో మెరక తొలగించి, సాగుకు అనువుగా చదును చేసేందుకు అనుమతులు తెచ్చుకుని, దాని మాటున కొందరు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. పగటి వేళ అధికారిక స్థలాల్లో తవ్వకాలు చేస్తూ రాత్రి సమయంలో ప్రభుత్వ భూములు, అనుమతులు లేని భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. రాజమహేంద్రవరం, కడియం, రామచంద్రపురం, మండపేట, రాజానగరం, అనపర్తి పరిసర ప్రాంతాల్లో స్థలాలు మెరక చేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని, రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలకు తెరలేపుతున్నారు. భారీ పొక్లెయిన్లతో.. : 200 హెచ్‌పీ పొక్లెయిన్ల బకెట్ పరిమాణం తక్కువగా ఉండి, లారీల్లో గ్రావెల్ లోడింగ్‌కు ఎక్కువ సమయం పడుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద బకెట్ పరిమాణం పెద్దగా ఉండే 300 హెచ్‌పీ పొక్లెయిన్లను మట్టి తవ్వకాల కోసం తీసుకువస్తుండటం గమనార్హం. పగటి వేళల్లో వీటిని గుట్టుచప్పుడు కాకుండా తోటల్లో దాచి, రాత్రి వేళల్లో బయటకు తీసి తవ్వకాలకు వినియోగిస్తున్నారు. మరోపక్క లారీలకు నంబర్ ప్లేట్లు తొలగించి మరీ పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు గ్రావెల్ తరలించేస్తున్నారు. తెల్లవార్లూ పెద్ద సంఖ్యలో లారీలు తిరుగుతూనే ఉంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. పెద్ద ఎత్తున సాగుతున్న తవ్వకాలతో ప్రభుత్వ భూములు అగాధాలను తలపిస్తున్నాయి. పారిశ్రామిక జోన్‌కు అడ్డంకిగా.. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ తవ్వకాలు పారిశ్రామికాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయి. గతంలో జిల్లాకు మంజూరైన పెట్రో యూనివర్సిటీని తొలుత ద్వారపూడిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 87 ఎకరాలు అవసరమవుతాయని గుర్తించారు. పరిశీలనకు వచ్చిన కేంద్ర కమిటీ ఈ భూములు వర్సిటీకి అనువుగా లేవని తేల్చింది. చివరకు మన జిల్లాలో ఏర్పాటు కావాల్సిన పెట్రో వర్సిటీ విశాఖ జిల్లాకు తరలిపోయింది. రోడ్డు, జల, ఆకాశ మార్గాన సరుకుల రవాణాలో నైపుణ్యాన్ని పెంచే లాజిస్టిక్ వర్సిటీని 60 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా గతంలో ప్రయత్నాలు జరిగాయి. దీనిపై పరిశీలన కోసం వచ్చిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రతినిధులు మళ్లీ ఆ ఊసే ఎత్తక ఆ ప్రతిపాదన మరుగునపడిపోయింది. స్థానిక మెట్ట రైతుల కోసం కేశవరంలో జీడిపప్పు, కొబ్బరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మండపేట, రాజానగరం మండలాల్లోని ఆయా గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూముల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు గతంలో ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలు అక్రమ తవ్వకాలతో భూములు అనువుగా లేక కార్యరూపం దాల్చలేదు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పట్టించుకోవడం లేదు. దీంతో తెలుగు తమ్ముళ్లకు అక్రమ తవ్వకాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
‘ఒట్లు చేయించుకోవటం మంచి పద్ధతి కాదు’
సాక్షి, తూర్పు గోదావరి: పెన్షన్ దారులతో మళ్లీ తమకే ఓట్లు వేయాలంటూ టీడీపీ నేతలు ఒట్లు చేయించుకోవటం(ప్రమాణం చేయించుకోవడం) మంచి పద్ధతి కాదని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఇటువంటి టీడీపీ సెంటిమెంటు కార్యక్రమాలను ఖండిస్తున్నామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల రూపంలో వచ్చిన ప్రభుత్వ ఆదాయంతో ఓట్లు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టారన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. జగనన్న బాటలో చంద్రన్న నడుస్తున్నారంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా తన వేషాలు ఆపాలని, ప్రజలు చాలా అసహ్యించుకుంటున్నారని చెప్పారు. స్పీకర్ సీట్లో నలచొక్కా వేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే కూర్చునేంతగా చట్ట సభల విలువలను దిగజార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నా’
సాక్షి, తూర్పు గోదావరి : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. సోమవారం ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సభలు పెట్టి బీసీలకు అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారిగా బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే అతన్ని దింపుతానంటూ తిరుగుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ వెళ్లి ‘ నేను లేఖ ఇవ్వటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద’ని అక్కడ మాట్లాడి, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీశారంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ప్రాంతీయ పార్టీ (తెలుగుదేశం) పెట్టి పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ఎన్టీఆర్‌ను శాశ్వతంగా సమాధి చేశాడు’
సాక్షి, తూర్పుగోదావరి : మామగారి కాళ్లమీద పడి తెలుగు దేశం పార్టీలో చేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు.. ఎన్టీ రామారావును పార్టీలోనుంచి, జీవితంలోనుంచి శాశ్వతంగా సమాధి చేశాడని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదన్నారు. 2019లో చంద్రబాబు రాజకీయాలనుంచి సమూలంగా బయటకు వెళ్లిపోతాడని జోష్యం చెప్పారు. చంద్రబాబు టక్కు, టమార విద్యలు నరేంద్ర మోదీ, అమిత్‌షాల ముందు పనిచేయలేదు కాబట్టే బయటకు వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. -
చేతలు అలా... మాటలు ఇలా..
జిల్లాలో బుధవారం జరిగిన పలు జన్మభూమి సభల్లో నిరసన గళాలు వినిపించాయి. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం క్రిష్ణవరం గ్రామంలో అధికార పక్షానికి చెందిన సర్పంచి, ఎంపీటీసీ వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని దాడి చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో కొత్తపల్లి, కుతుకుడుపల్లి గ్రామాలకు సంబంధించిన గ్రామసభలో అధికారులను నిలదీశారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నివేశన స్థలాలు, సమస్యలు పరిష్కరించడం లేదని సీపీఐ (లిబరేషన్) పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు. ఒకే రోజు... ఒకే సమయం... విభిన్న అభిప్రాయాలు ... జన్మభూమి సభల్లో నిలదీతలు ... కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆందోళనలు... సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలివీ. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన ‘జన్మభూమి–మా వూరు’ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం రాకను జిల్లా బీసీ సంఘాల నేతలు ‘బ్లాక్ డే’గా ప్రకటించాయి. సభా ప్రాంగణంలో నిరసనలు తెలపాలని భావించాయి. ముందస్తు హౌస్ అరెస్టులతో పోలీసులు భయోత్పాతం సృష్టించడంతో ఆయా సంఘాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన జన్మభూమి సభల్లో జనం కన్నెర్ర చేసి నిలదీతల పరంపర కొనసాగించారు. సీఎం వచ్చి, వెళ్లేంత వరకూ ఇదే వేడి కొనసాగింది. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి ‘జన్మభూమి–మా ఊరు’ సభకు బుధవారం వచ్చిన సీఎం చంద్రబాబు సభలో నిరసన తెలియజేయాలన్న బీసీల వ్యూహాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేశారు. బీసీ నేతలను గృహ నిర్బంధాలు,... ముందుస్తు అరెస్టులతో ఇళ్లకే పరిమితం చేశారు. సాక్షి, రాజమహేంద్రవరం/ముమ్మిడివరం: కాపు కార్పొరేషన్ ద్వారా 2016 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 286 మందికి రుణాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో సూర్యనారాయణ అనే వ్యక్తితో అసత్యాలు చెప్పించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం చంద్రబాబు సభకు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు బీసీ, కాపు కార్పొరేషన్ లబ్ధిదారులతో సభలో మాట్లాడించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ నుంచి రెండు లక్షల రుణం తీసుకున్నానని, తనకు రుణం ఎలా వచ్చిందన్న విషయం సూర్యనారాయణ అనే వ్యక్తి వివరించారు. సీఎం చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 34 వేల మంది కాపులకు రుణాలు ఇప్పించారని పేర్కొన్నారు. అంతకు కొద్ది నిమిషాల ముందు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో 40 ఏళ్లుగా తాను నీతి, నిజాయతీలతో ఉన్నానని చెప్పిన తర్వాతే ప్రభుత్వం సూర్యనారాయణతో కాపు కార్పొరేషన్ ద్వారా 34 వేల మందికి రుణాలు ఇచ్చినట్లు చెప్పించడంతో సభకు వచ్చిన అధికారులు అవాక్కయ్యారు. ముమ్మిడివరంపై వరాల జల్లు ముమ్మిడివరం నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న ఆరు ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకాల మరమ్మతుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఐ.పోలవరం మండలం జి.ములపొలం–గొల్లగరువులో నిలిచిపోయిన వంతెన పనులకు సంబంధించి రూ. 60 కోట్లతో తిరిగి అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. గుజరాత్ పెట్రోలియం సంస్థ నుంచి మత్స్యకారులకు రావాల్సిన 12 నెలల నష్టపరిహరం ఇపించేందుకు చర్యలు తీసుకుంటామని çహామీ ఇచ్చారు. సభకు కాలేజీ బస్సులు.. విద్యార్థులకు అవస్థలు... జన్మభూమి–మా ఊరు సభకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో కోనసీమలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు పంపించారు. ఆయా బస్సులలో డ్వాక్రా మహిళలు, రైతులు, పింఛన్ లబ్ధిదారులు వచ్చేలా డీఆర్డీఏ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఆయా అధికారులు వారిని తీసుకురావడానికి, సీఎం ప్రసంగం పూర్తయ్యేవరకు ఉంచటానికి పడరాని పాట్లు పడ్డారు. సీఎం మాట్లాడుతుండగానే సభ నుంచి మహిళలు వెళ్లిపోవడంతో సభ పేలవంగా మారింది. డ్వాక్రా మహిళలు వెళ్లిపోతుండగా డీఆర్డీఏ అధికారులు బలవంతంగా వారిని సభలో కూర్చోబెట్టారు. పలు పనులకు శంకుస్థాపనలు... ముందుగా సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీఆర్డీఏ స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం రూ.35 కోట్లతో నిర్మించే ఐ.పోలవరం మండలం సలాది వారిపాలెం–పశువుల్లంక గోదావరిపాయపై వంతెన నిర్మాణ పనులకు, ముమ్మిడివరంలో రూ.45 కోట్లతో నిర్మించే 133 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, రూ. 25 కోట్లతో నిర్మించే మహిపాల చెరువు–పల్లంకర్రు ఆర్అండ్బీ రోడ్డు పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యుత్‌శాఖ మం త్రి కిమిడి కళా వెంకటరావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, పాల్గొన్నారు. -
జాతరలో అశ్లీల నృత్యాలు చేయించిన టీడీపీ నేతలు!
సాక్షి, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో టీడీపీ నేతలు అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపారు. అమ్మవారి జాతర సందర్భంగా రెండు స్టేజీలు ఏర్పాటుచేసి.. యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. అంతేకాకుండా పేకాట, గుండాటలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు టీడీపీ నేతలు కావడంతో పోలీసులు కూడా ఈ తంతును చూసీచూడనట్టు వదిలేశారు. స్థానిక ప్రజలు మాత్రం టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ అసభ్య కార్యక్రమాలేమిటని ప్రశ్నిస్తున్నారు. -
తెలుగుపద్యం చెప్పలేదని.. దారుణం!
సాక్షి, కాకినాడ: తెలుగు పద్యం చెప్పలేదని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులపట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. 24మంది విద్యార్థులను చెప్పుతో కొట్టాడు. ఈ అనాగరిక ఘటన తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం భీమవరం ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. తెలుగు పద్యాన్ని అప్పజెప్పనందుకు ఓ ఉపాధ్యాయుడు 24మంది విద్యార్థులను చెప్పుతో కొట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏటీడబ్ల్యూవోను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. -
అందుకే ‘నోట్-4’ కాలింది: షావోమి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఇటీవల రెడ్మి నోట్-4 కాలి భావన సూర్యకిరణ్ అనే యువకుడికి గాయాలైన ఘటనపై చైనా కంపెనీ షావోమీ స్పందించింది. ఇందులో తమ తప్పేమీ లేదనే రీతిలో... ఫోన్‌ను విపరీతమైన ఒత్తిడికి గురి చేసినందునే ఈ ఘటన చోటుచేసుకుని ఉంటుందని పేర్కొంది. కస్టమర్‌తో పలుమార్లు మాట్లాడిన అనంతరం కాలిపోయిన ఫోన్‌ను తెప్పించుకుని పరిశీలించామని ఫోన్‌పై వేరే ఒత్తిడితో బ్యాక్ కవర్‌తో పాటు బ్యాటరీ ప్రభావితమైందని, స్ర్కీన్ దెబ్బతిన్నదని ప్రాథమికంగా వెల్లడైందని కంపెనీ పేర్కొంది. ఫోన్ దెబ్బతినడానికి సరైన కారణమేంటనేది పూర్తి పరిశోధన అనంతరం తేలుతుందని తెలిపింది. సంబంధిత వార్త... కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు! -
కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు!
రావులపాలెం: ప్యాంటు జేబులో పెట్టుకున్న చైనా సెల్‌ఫోన్ కాలిపోవడంతో ఓ యువకుడు గాయపడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో చోటుచేసుకుంది. రావులపాలెం గ్రామానికి చెందిన భావన సూర్యకిరణ్ కిళ్ళీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అతను సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి. దీంతో బండి దిగి ఎంత లాగినా ఫోన్ బయటకు రాలేదు. మంటలు గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పి ఫోన్‌ను కింద పడేశారు. ఈ సంఘటనలో కిరణ్ తొడ భాగంలో గాయాలయ్యాయి. ఇరవై రోజుల క్రితమే కొనుగోలు చేసిన రెడ్-ఎంఐ నోట్-4 ఫోన్ ఇలా కాలిపోయిందని కిరణ్ తెలిపారు. కొత్త నోట్-4 ఫోన్ కాలిపోవడమే కాకుండా ఆ మంటల వల్ల తనకు గాయాలయ్యాయని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. -
కాపులు ఏమైనా టెర్రరిస్టులా?
హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పోలీసులను మోహరించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. జిల్లాలో పోలీసులను ఎందుకు మోహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు చంద్రబాబు సర్కారును నిలదీశారు. కాపుల సమస్యను శాంతిభద్రతల సమస్యగా ప్రభుత్వం చిత్రీకరిస్తున్నదని మండిపడ్డారు. పోలీసులు ఏ చట్టపరిధిలో వ్యవహరిస్తున్నారో డీజీపీ చెప్పాలని నిలదీశారు. చట్టాలను ప్రభుత్వం గౌరవించదా? అని ప్రశ్నించారు. కాపులను అవమానిస్తున్న చంద్రబాబు సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదని కన్నబాబు హెచ్చరించారు. కాపులు ఏమైనా టెర్రరిస్టులా అని ఆయన ప్రశ్నించారు. పోలవరంపై కాకి లెక్కలు! పోలవరం ప్రాజెక్టుపై పెరిగిన అంచనా వ్యయం వివరాలు తమకు అందలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, పెరిగిన అంచనా వ్యయం వివరాలను కేంద్రానికి ఎందుకు పంపలేదని కన్నబాబు నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు చెప్తున్న కాకిలెక్కలను కేంద్రం గుర్తిస్తుందని భయమా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటున్నదని మంత్రి దేవినేని ఉమ అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కోర్టులో పిటిషన్లు వేశాయని, మరి పిటిషన్లు మీరు వేయించారా? అని కన్నబాబు ప్రశ్నించారు. -
కాపులు ఏమైనా టెర్రరిస్టులా?
-
తలపై వేడి నూనె పోసి.. కత్తితో నరికి!
చీటి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తుండటంతో విసిగిపోయిన ఓ మహిళ చీటి నిర్వాహకురాలిని దారుణంగా చంపేసింది. తలపై వేడి నూనె పోసి.. కత్తితో పొడిచి హతమార్చింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి చీటిల వ్యాపారం నిర్వహిస్తోంది. సత్యనారాయణమ్మ అనే మహిళ దగ్గర నుంచి 4లక్షల చీటి డబ్బులు తీసుకుని ఏడేళ్ల నుంచి ఇవ్వకుండా వేధిస్తోంది. దీంతో విసిగిపోయిన సత్యనారాయణమ్మ.. వెంకటలక్ష్మి తలపై వేడి నూనె పోసి.. కత్తితో దారుణంగా నరికి చంపింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
అందరూ ఒకేసారి చనిపోవాలని..
► తల్లి సహా ఆత్మహత్య చేసుకున్న తనయులు ► కుమారులు, భార్యను పోగొట్టుకుని ఒంటరైన ఓ తండ్రి కథ ఇది. ► కొత్తపల్లి మండలం అమరవిల్లిలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన ► చక్కని కుటుంబంలో చిచ్చు రేపిన కిడ్నీ రోగం తూర్పు గోదావరి జిల్లా : నీకేంటయ్యూ..ముగ్గురు కొడుకులూ అందొచ్చారంటే.. నువ్వు మారాజువి, మీ ఆవిడ మహారాణే’ అని తోటివారన్నప్పుడు ఆయన మురిసిపోయూడు. విధికి తనపై కన్ను కుడుతుందనీ కలలోనైనా శంకించలేదు. బిడ్డలపై పాడు వ్యాధి పడగనీడలా కమ్ముకుంటుంటే తట్టుకోలేక పోయూడు. విధిని ఎదిరించలేకా, వ్యాధికి చికిత్స చేరుుంచలేకా తానే లోకాన్ని వీడాలనుకున్నాడు. ఆయన వ్యధను చూడలేని బిడ్డలూ, భార్యా తామే లోకం నుంచి నిష్ర్కమించారు. ఇప్పుడాయన బతుకు శిశిరం వేళ మోడు. గుండె పచ్చి పుండు. గత నెలలో కొత్తపల్లి మండలం అమరవిల్లిలో జరిగిన హృదయ విదారక విషాదంపై ‘సాక్షి’ ఫోకస్.. 2016 జూలై ఆరో తేదీ రాత్రి.. ఊళ్లో వాళ్లందరూ నిద్ర లో ఉన్నారు. ఆ ఇంటిలో మాత్రం లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఏదో తెలియని అలజడి.. కుటుంబసభ్యులంతా తీవ్ర చర్చలో ఉన్నారు. ‘మీరు లేకుండా నేను ఎలా బతకాలిరా? అది నా వల్ల కాదు.. ముందు నేనే చనిపోతా’ అంటూ తండ్రి. ‘లేదు..లేదు నాన్నా! మేము బతికుండడం అమ్మకూ, నీకూ భారమే. అందుకే మేమే చనిపోతాం’ అంటూ ముగ్గురు కుమారులు.. ఇలా అర్ధరాత్రి వరకూ వారి మధ్య విషాదభరిత వాదం జరిగింది. తెల్లారేసరికి కొడుకులు జన్మనిచ్చిన తల్లితో కలిిసి విషం తాగి, జలసమాధి కాగా .. ఆ కుటుంబ యజమాని కమ్ముకున్న శోకాంధకారంలో ఏకాకిలా మిగిలాడు. కిడ్నీలు మారిస్తే పిల్లలు బతికే అవకాశం ఉందని, అయితే దానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు దానికీ సిద్ధపడ్డారు. ఆస్తులు అమ్మై సరే పిల్లలను బతికించుకోవాలనుకున్నారు. అంతే కాదు వారి కిడ్నీలు పిల్లలకు ఇవ్వడానికీ రెడీ అయ్యారు. ఒక కుమారుడికి తండ్రి, మరో కుమారుడికి తల్లి కిడ్నీ ఇస్తే.. మూడో కుమారుడి పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఆ రాత్రే.. కాళరాత్రి.. కన్న బిడ్డలు అనారోగ్యంతో తమ ముందే కళ్లు మూస్తే ఇక తాము బతికి సాధించేదేముందని జాలై ఏడో తేదీ రాత్రి తల్లిదండ్రులు తీవ్రంగా చర్చించుకున్నారు.‘ పిల్లలు లేకుండా నేను బతకలేను’ అంటూ తండ్రి. ‘లేదు నాన్నా.. మా వల్ల అమ్మ, నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమే చనిపోతాం’ అని పిల్లలు ఇలా రాత్రంతా వారు తీవ్రంగా మథనపడ్డారు. తెల్లారేసరికి.. తల్లి, ఆమె ముగ్గురు కుమారులు సమీపంలోని ఉప్పుటేరులో శవాలుగా తేలారు. ఆ రాత్రి తండ్రికి చెప్పినట్టుగానే ప్రాణాలు తీసుకుని.. ఆ తండ్రిని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. జీవితాంతం కలిసి ఉంటానన్న భార్య కూడా పిల్లల వెంటే వెళ్లి భర్తను ఒంటరిని చేసింది. ఎదిగొచ్చిన కొడుకులతో జీవితం సాఫీగా సాగాల్సిన ఆ తండ్రి ఇదిగో ఇలా దీనంగా.. దిక్కులేని వాడిగా మారాడు. భార్య, పిల్లల జ్ఞాపకాలను మరచిపోలేక మంచాన పట్టాడు. ఏకాంత జీవనం గడుపుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమరవిల్లి గ్రామమది. ఆ గ్రామంలో రాగల రాము, భూలక్ష్మిలకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇక ముగ్గురు కుమారులు ప్రభు ప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్(18). కొంత వరకు చదువుకున్న వీరు ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్దే ఉంటున్నారు. అస్వస్థతకు గురై.. నాలుగేళ్ల క్రితం చిన్న కుమారుడు ప్రేమసాగర్ అస్వస్థతకు గురయ్యాడు. ఇతడిని కాకినాడలోని ఓ ప్రై వేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు అతడికి కీడ్నీలు పాడయ్యాయని ఆపరేషన్ చేయాలన్నారు. కొంత కాలం వరకు డయాలసిస్ చేయించాలని చెప్పగా.. నాలుగేళ్ల నుంచి వైద్యం చేయిస్తున్నారు. మిగిలిన ఇద్దరు కుమారులు ప్రభు ప్రకాష్, అనిల్ కుమార్‌లు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారినీ ఆస్పత్రిలో చూపించిన తల్లిదండ్రులకు వైద్యులు షాక్ ఇచ్చారు. వారి కిడ్నీలు పాడయ్యాయని, ఆపరేషన్ చేయించక తప్పదని ఆ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మానసిక సంఘర్షణ మధ్య... ఒకరి తర్వాత ఒకరికి ముగ్గురి కుమారులకు ఒకే విధమైన ఆరోగ్య సమస్య రావడం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తమ్ముడికి ఒంట్లో బాగోకపోతే అన్నయ్యలు ఆస్పత్రికి తీసుకెళ్లడం, అన్నయ్యకు ఒంట్లో బాగోకపోతే తమ్ముళ్లు ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ఇక ముగ్గురూ అనారోగ్యంతో ఉంటే తల్లిదండ్రులే ఊరికి సుమారు 30 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న కాకినాడకు పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా తీసుకువెళ్లేవారు. మరోవైపు వైద్యులు వంశపారంపర్యంగా పిల్లలకు ఆరోగ్య సమస్య వచ్చిందని, ఎంత ఖర్చు చేసినా వారు బతకడం కష్టమేనని చెప్పడంతో ముఖ్యంగా తల్లి మానసికంగా కుంగిపోయింది. తన సోదరులు ఇదే ఆరోగ్య సమస్యతో ప్రాణాలు కోల్పోవడంతో తన పిల్లలూ అదే వ్యాధితో చనిపోతారనే బెంగతో ఆమె తల్లడిల్లిపోయేది. అందరం ఒకేసారి చనిపోవాలని.. ‘నాన్న ఆరోగ్యంగానే ఉన్నాడు. మన వల్ల ఆయన మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ఏం చేద్దాం అమ్మా?’ అంటూ కుమారులు తల్లితో అన్నారు. అనారోగ్యంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మనం.. నాన్నను బతికించుకుని మనమే తనువు చాలిద్దామని నిర్ణయించుకున్నారు. దానికి తల్లి కూడా సరేనంది. అంతే ఆ అర్ధరాత్రే నలుగురూ కలిసి పురుగు మందు తాగారు. అంతే కాదు. ఏ ఒక్కరూ బతికి ఉండకూడదని నిర్ణయించుకుని తాడుతో కట్టుకుని మరీ ఉప్పుటేరులోకి దూకారు. ఆ తండ్రిని ఒంట రిని చేసి వెళ్లిపోయారు. డిగ్రీ వరకు చదువుకుని చదువు మానేసిన పెద్ద కొడుకులిద్దరూ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహకరిస్తుండగా చిన్న కుమారుడు ప్రేమ ప్రకాష్ పదో తరగతి వరకూ చదివి, అనారోగ్యం రావడంతో మానేశాడు. అప్పటి వరకు తమతో క్రికెట్ ఆడుతు సరదాగా ఉండే ప్రకాష్ గత కొన్ని రోజుల నుంచి ఆటలకు కూడా రావడం లేదని తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. సాధికార సర్వేలో ఈ అంశం చేర్చాలి ప్రభుత్వ సాధికార సర్వేలో ఆరోగ్యానికి సంబంధించి, దీర్ఘకాలిక వ్యాధులు వివరాలు తెలిపే అంశం చేర్చాలి. దానివల్ల ఈ వ్యాధులు సోకిన వారి గణాంకాలు ప్రభుత్వం దగ్గర ఉంటే రాబోయే రోజుల్లోనైనా ఎటువంటి సహాయం అందించాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారిలో మనోధైర్యం నింపడానికి అవగాహన సదస్సులు నిర్వహించవచ్చు. భవిష్యత్తులో ఎవరూ బలవన్మరణాలకు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. - తూతిక శ్రీనివాస విశ్వనాథ్, ఎంపీడీఓ, అంబాజీపేట మనిషి.. మనిషిలో లేడు. పిల్లలను కాపాడుకునేందుకు అన్న, వదిన ఎంతో కష్టపడ్డారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చాలా వరకు ఖర్చుపెట్టారు. అయినా వారికి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. కిడ్నీల వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పడంతో లోలోపల కుమిలిపోయేవారు. వదిన, పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో అన్నయ్య ఇలా ఒంటరయ్యాడు. మనిషి.. మనిషిలో లేడు. - రాగల అప్పలరెడ్డి, రాము తమ్ముడు, అమరవిల్లి కలలో కూడా ఊహించ లేదు.. మా మనుమల పెళ్లిళ్లు చూడాల్సిన నేను. వాళ్ల చావులు చూడాల్సి వచ్చింది. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఎదిగి అందివచ్చిన సమయంలో మనుమలు, మా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో అల్లుడు అనాథయ్యాడు. అతడిని చూస్తుంటే బాధేస్తోంది. - వాకా అప్పయ్మమ్మ, రాము అత్త మూత్రపిండాల వ్యాధులు ఏ విధంగానైనా రావచ్చు. ముందుగా వాటిని గుర్తించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ డిసీజెస్, స్వెల్లింగ్ ఇలా వివిధ రకాల్లో రావచ్చు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ముందుగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. - డాక్టర్ సురేంద్రబాబు, ఎంఎస్, ఎంసీహెచ్, యూరాలజీ స్పెషలిస్ట్ -
కాపు నాయకుల దీక్ష భగ్నం..!
పీ గన్నవరం: కాపు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా కాపు యువత నేతలు చేస్తున్న దీక్షను అధికారులు భగ్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం సెంటర్లో నిరాహర దీక్ష చేస్తున్న ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆదివారం క్షీణించింది. దీంతో వారి దీక్షను భగ్నం చేసి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాపు రిజర్వేషన్ల కోసం మొత్తం ఎనిమిది మంది ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఆదివారం రాత్రి రెవెన్యూ అధికారులు దీక్షా స్థలికి వద్దకు చేరుకుని దీక్షలో ఉన్న బోడపాటి తాతాజీ, పొలిశెట్టి నాగబాబు, అప్పన సురేష్బాబులను ఆస్పత్రికి తరలించారు. నలుగురు కాపు నాయకుల ఆమరణదీక్ష నర్సాపురం: కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం కుప్పర్రు గ్రామంలో నలుగురు ఆదివారం సాయంత్రం ఆరమణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అంకం బన్ను, యాదవరెడ్డి సూరిబాబు, యాదవరెడ్డి రఘుతోపాటు మరొకరు దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించేవరకు తమ దీక్ష కొనసాగుతుందని వారు అన్నారు. -
బాలిక గొంతు కోశారు
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెల్లిపాక మండలం రాజపేటలో గుర్తు తెలియని కొందరు దుండగులు ఎనిమిదేళ్ల బాలిక గొంతు కోశారు. దీంతో ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాలికను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగులు ఎవరై ఉంటారు.. తెలియనివారా, తెలిసిన వారు అసలు ఎందుకు ఈ చర్యకు వారు పాల్పడ్డారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
దేవుణ్ని గుండెల్ల్లో దాచుకోండి... కెమెరాల్లో కాదు!
అనగనగా ఓ అడవి. ఆ అడవిలో చిన్న ఊరు. ఆ ఊళ్లో చక్కటి శివాలయం. ఆలయం పక్కనే జలపాతం. ఆ ప్రవాహంలో కాళ్లు కడుక్కుని తల మీద నీళ్లు చల్లుకుని ఆలయం లోపలికెళ్తే... అంతా నిశ్శబ్దం. ‘కదలండి’ అంటూ తోసేవాళ్లుండరు. పరమశివుడిని కళ్లారా చూసుకోవచ్చు. పూజారి కనిపించడు. ఎవరి పూజ వాళ్లే చేసుకోవాలి. చేతులు జోడించి నమస్కారం చేసుకున్న తర్వాత అలవాటుగా పర్సు తీసి దేవునికి కానుక వేద్దామని చూస్తే ఎక్కడా హుండీ కనిపించదు. ఒకవేళ అక్కడే ఉన్న పళ్లేలలో వేసినా కూడా ఆలయం బాగోగులు చూసే గిరిజనులు వచ్చి డబ్బు వెనక్కి ఇచ్చేస్తారు. ఈ విశ్వేశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం పేరంటాల పల్లిలో ఉంది. ఇది నిన్నమొన్నటి వరకు ఖమ్మం జిల్లా. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంలో భాగంగా ఆ గ్రామాన్ని తూర్పు గోదావరి జిల్లాకు బదలాయించడమైంది. ఇది పూర్తిగా గిరిజనుల ఆవాసం. కొండరెడ్డి జాతి ఇక్కడ ఎక్కువగా నివసిస్తోంది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను ఈ గిరిజనులే నిర్వహిస్తారు. ఆలయం పక్కనే ఉన్న సెలయేటి నుంచి నీటిని తెచ్చి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు. పూజ చేస్తారు. ఆలయ నిర్వహణ కోసం గిరిజనేతరుల నుంచి విరాళాలు సేకరించరు, పర్యాటకులు విరాళాలివ్వజూపినా స్వీకరించరు. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్నీ ఊళ్లో వాళ్లంతా కలిసి వేడుక చేసుకుంటారు. అందరూ తలా ఓ పని చేసి ఊరంతటికీ వంటలు చేస్తారు. సామూహికంగా భోజనాలు చేస్తారు. దేవుడికి భజనలు చేస్తారు. మద్యం సేవించిన వారికి, మాంసం భుజించిన వారికీ ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. ఆలయంలో ఫొటోలు తీయరాదు. దేవుడిని మనసులో ప్రతిష్ఠించుకోవాలి తప్ప కెమెరాల్లో కాదంటారు. పైగా అది పాపం అంటారు. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా... పాపి కొండల పర్యటనకు వచ్చే వారంతా ఈ ఆలయాన్ని, పక్కనే ఉన్న ఆశ్రమాన్ని చూస్తారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో రూపాయి కానుకగా సమర్పించినా ఇప్పటికి ఆలయానికి కోట్ల రూపాయల నిధి జమ అయ్యేది. కానీ దేవుణ్ని డబ్బుతో కాదు మనసుతో చూడాలంటారు ఈ గిరిజనులు. పేరంటపల్లిలో కొండ దరిగా పనసచెట్టు నీడన అమ్మవారు ఎల్లమ్మ (విశ్వమాత) పేరుతో వెలిసింది. అమ్మవారు ఒకనాడు పరివ్రాజకులైన (సన్యాసి) బాలానంద స్వామికి ప్రత్యక్షమై అతడిని అనుంగు బిడ్డగా స్వీకరించిందని, అతడిని విశ్వేశ్వర లింగం ఉన్న చోటికి తీసుకువచ్చి ఆమె శివలింగంలో లీనమైందని చెబుతారు. ఆ విశ్వమాత ఆదేశానుసారమే బాలానంద 1927లో చిన్న తిన్నె మీద అమ్మవారిని ప్రతిష్టించారు. అదే ప్రదేశంలో రామకృష్ణ మునివాటం అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. తర్వాత కొన్నేళ్లకు... అంటే 1963లో స్వామి వివేకానంద శతజయంతిని పురస్కరించుకుని సర్వమత సామరస్యాన్ని తెలుపుతూ ఆయా చిహ్నాలతో పరిపూర్ణమైన ఆలయాన్ని నిర్మించారు. విశ్వేశ్వర లింగాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఇదీ ఆలయ చరిత్ర. బాలానంద స్వామికి వయసుడిగి ఆరోగ్యం క్షీణించడంతో ఆలయ నిర్వహణ బాధ్యతను స్థానిక గిరిజనులకు అప్పగించారు. ఆలయ బాధ్యతను అప్పగించేటప్పుడు ఆయన చెప్పిన నియమాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు గిరిజనులు. స్వామీజీ చెప్పిన అన్ని నియమాలలోనూ పరమార్థం ఎంతో కొంత తెలుస్తోంది కానీ ఆలయం బయట ఉన్న గంటను ఒక్కసారి మాత్రమే మోగించాలనే నియమం ఎందుకో తెలియదంటారు. - అశోక్, సాక్షి, పేరంటపల్లి -
గోదావరిలో బోటు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గోదావరి నదిలో టూరిస్టులను తీసుకెళ్తున్న బోటు బలమైన ఈదురు గాలులకు తిరగబడింది. కాగా ప్రయాణికులందరూ సురక్షింగా బయటపడ్డారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదీ ద్వీపంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. టూరిస్టులందరినీ వెంటనే రక్షించి వేరే బోటులోకి చేర్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టూరిస్టులందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.