దేవుణ్ని గుండెల్ల్లో దాచుకోండి... కెమెరాల్లో కాదు!
అనగనగా ఓ అడవి. ఆ అడవిలో చిన్న ఊరు. ఆ ఊళ్లో చక్కటి శివాలయం. ఆలయం పక్కనే జలపాతం. ఆ ప్రవాహంలో కాళ్లు కడుక్కుని తల మీద నీళ్లు చల్లుకుని ఆలయం లోపలికెళ్తే... అంతా నిశ్శబ్దం. ‘కదలండి’ అంటూ తోసేవాళ్లుండరు. పరమశివుడిని కళ్లారా చూసుకోవచ్చు. పూజారి కనిపించడు. ఎవరి పూజ వాళ్లే చేసుకోవాలి. చేతులు జోడించి నమస్కారం చేసుకున్న తర్వాత అలవాటుగా పర్సు తీసి దేవునికి కానుక వేద్దామని చూస్తే ఎక్కడా హుండీ కనిపించదు. ఒకవేళ అక్కడే ఉన్న పళ్లేలలో వేసినా కూడా ఆలయం బాగోగులు చూసే గిరిజనులు వచ్చి డబ్బు వెనక్కి ఇచ్చేస్తారు.
ఈ విశ్వేశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లా వి.ఆర్.పురం మండలం పేరంటాల పల్లిలో ఉంది. ఇది నిన్నమొన్నటి వరకు ఖమ్మం జిల్లా. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంలో భాగంగా ఆ గ్రామాన్ని తూర్పు గోదావరి జిల్లాకు బదలాయించడమైంది. ఇది పూర్తిగా గిరిజనుల ఆవాసం. కొండరెడ్డి జాతి ఇక్కడ ఎక్కువగా నివసిస్తోంది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను ఈ గిరిజనులే నిర్వహిస్తారు. ఆలయం పక్కనే ఉన్న సెలయేటి నుంచి నీటిని తెచ్చి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తారు.
పూజ చేస్తారు. ఆలయ నిర్వహణ కోసం గిరిజనేతరుల నుంచి విరాళాలు సేకరించరు, పర్యాటకులు విరాళాలివ్వజూపినా స్వీకరించరు. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్నీ ఊళ్లో వాళ్లంతా కలిసి వేడుక చేసుకుంటారు. అందరూ తలా ఓ పని చేసి ఊరంతటికీ వంటలు చేస్తారు. సామూహికంగా భోజనాలు చేస్తారు. దేవుడికి భజనలు చేస్తారు. మద్యం సేవించిన వారికి, మాంసం భుజించిన వారికీ ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. ఆలయంలో ఫొటోలు తీయరాదు. దేవుడిని మనసులో ప్రతిష్ఠించుకోవాలి తప్ప కెమెరాల్లో కాదంటారు. పైగా అది పాపం అంటారు.
ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా...
పాపి కొండల పర్యటనకు వచ్చే వారంతా ఈ ఆలయాన్ని, పక్కనే ఉన్న ఆశ్రమాన్ని చూస్తారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో రూపాయి కానుకగా సమర్పించినా ఇప్పటికి ఆలయానికి కోట్ల రూపాయల నిధి జమ అయ్యేది. కానీ దేవుణ్ని డబ్బుతో కాదు మనసుతో చూడాలంటారు ఈ గిరిజనులు.
పేరంటపల్లిలో కొండ దరిగా పనసచెట్టు నీడన అమ్మవారు ఎల్లమ్మ (విశ్వమాత) పేరుతో వెలిసింది. అమ్మవారు ఒకనాడు పరివ్రాజకులైన (సన్యాసి) బాలానంద స్వామికి ప్రత్యక్షమై అతడిని అనుంగు బిడ్డగా స్వీకరించిందని, అతడిని విశ్వేశ్వర లింగం ఉన్న చోటికి తీసుకువచ్చి ఆమె శివలింగంలో లీనమైందని చెబుతారు. ఆ విశ్వమాత ఆదేశానుసారమే బాలానంద 1927లో చిన్న తిన్నె మీద అమ్మవారిని ప్రతిష్టించారు. అదే ప్రదేశంలో రామకృష్ణ మునివాటం అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. తర్వాత కొన్నేళ్లకు... అంటే 1963లో స్వామి వివేకానంద శతజయంతిని పురస్కరించుకుని సర్వమత సామరస్యాన్ని తెలుపుతూ ఆయా చిహ్నాలతో పరిపూర్ణమైన ఆలయాన్ని నిర్మించారు. విశ్వేశ్వర లింగాన్ని అందులో ప్రతిష్ఠించారు. ఇదీ ఆలయ చరిత్ర.
బాలానంద స్వామికి వయసుడిగి ఆరోగ్యం క్షీణించడంతో ఆలయ నిర్వహణ బాధ్యతను స్థానిక గిరిజనులకు అప్పగించారు. ఆలయ బాధ్యతను అప్పగించేటప్పుడు ఆయన చెప్పిన నియమాలనే ఇప్పటికీ పాటిస్తున్నారు గిరిజనులు. స్వామీజీ చెప్పిన అన్ని నియమాలలోనూ పరమార్థం ఎంతో కొంత తెలుస్తోంది కానీ ఆలయం బయట ఉన్న గంటను ఒక్కసారి మాత్రమే మోగించాలనే నియమం ఎందుకో తెలియదంటారు.
- అశోక్, సాక్షి, పేరంటపల్లి